BJP | హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో బీజేపీకి సొంత నేతల నుంచే సహాయ నిరాకరణ ఎదురవుతున్నది. కొన్నిచోట్ల వలస నేతలకు టికెట్లు ఇవ్వడంతో ఆయా నియోజకవర్గాల్లో అప్పుడే అసమ్మతి మొదలైంది. కొందరు నేతలు బహిరంగంగానే తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా రాష్ట్ర నాయకత్వం వద్దే తమ వ్యతిరేకతను వెల్లడిస్తున్నారని సమాచారం. ఇప్పటికే వలస నేతలకు టికెట్లిచ్చిన అనేక నియోజకవర్గాల్లో సీనియర్లు, పాతతరం కార్యకర్తలు ‘మాకేం సంబంధం లేదు’ అన్నట్టుగా అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని చెప్తున్నారు. ‘దశాబ్దాలుగా పార్టీని నమ్ముకొని ఉన్నవాళ్లను కాదని, నిన్నగాక మొన్న చేరినవారికి టిక్కెట్టిచ్చి మమ్మల్ని అవమానిస్తారా?’ అంటూ తీవ్రస్థాయిలో మండిపడుతున్నట్టు తెలుస్తున్నది.
తాము ఏండ్లకేండ్లు కష్టపడి, వ్యవస్థలపై పోరాడి, కేసులు ఎదుర్కొని, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తే.. ఇన్నాళ్లూ తమను తిట్టిన వారినే తెచ్చి తమ నెత్తిపై రుద్దుతున్నారని నేతలు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఇటీవల నల్లగొండ టికెట్‌ను సైదిరెడ్డికి ఇవ్వొద్దని రాష్ట్ర కార్యాలయంలో ఆ జిల్లా నేతలు నిరసన తెలుపడమే ఇందుకు ఉదాహరణ. మరోవైపు పార్టీకి అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడైనా తమకు అవకాశాలు వస్తాయని భావించామని, కానీ డబ్బున్న వారికే టికెట్లు కేటాయిస్తున్నారంటూ మరికొందరు నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ‘పార్టీలు మారకుండా సిద్ధాంతం కోసం పనిచేయడమే మేం చేసిన పాపమా?’ అంటూ కొందరు సీనియర్ నేతలు వాపోతున్నారు. డబ్బున్న వాళ్లకే సీట్లిచ్చే సంస్కృతి తమ పార్టీలోనూ మొదలైందని ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో బీజేపీ రాష్ట్ర నేత ఒకరు వ్యాఖ్యానించారు. టికెట్ ఇస్తేనే వస్తామని నిబంధన పెట్టిమరీ వస్తున్నవారు కూడా ఉన్నారని వాపోయారు. శ్రేణుల్లో నిర్వేదం నిజమేనని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తమకు జరిగిన అన్యాయంపై పలువురు నేతలు రాష్ట్ర నాయకత్వం వద్ద ఏకరువు పెట్టినా అధిష్ఠానం చేతులెత్తేయడంతో, లోక్‌సభ ఎన్నికల్లో సహాయ నిరాకరణే అస్త్రంగా వివిధ నియోజకవర్గాల్లో పలువురు నేతలు సిద్ధమైనట్టు చర్చ జరుగుతున్నది.
రాష్ట్రంలో దశాబ్దాలుగా పనిచేస్తున్న నికార్సైన కార్యకర్తలకు అవకాశాలు ఇవ్వకుండా సూక్తులు చెప్పి మభ్యపెడుతున్నారని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘నికార్సైన బీజేపీ కార్యకర్తలు టిక్కెట్ అడగరని, పార్టీ ఇస్తే తీసుకుంటా అనుకునే వాళ్లే పరిపూర్ణమైన కార్యకర్తలు’ అంటూ తమకు నూరిపోస్తున్నారని మండిపడుతున్నారు. ‘త్యాగాలు లిఖించబడుతాయి.. గుణించబడతాయి’ అంటూ కాకమ్మ కబుర్లు చెప్తున్నారని, ఎన్నికల వేళ కాకుండా ఇంకెప్పుడు తమకు అవకాశాలు ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. సూక్తులన్నీ చెప్పి తరాలుగా తమను కార్యకర్తలుగానే మిగుల్చుతున్నారని, వలస నేతలకు అందలం ఎక్కిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అసంతృప్తి ఇలాగే కొనసాగితే లోక్‌సభ ఎన్నికల్లో గట్టి దెబ్బ తగలడం ఖాయమనే భావనకు అధిష్ఠానం వచ్చినట్టు తెలిసింది. బుజ్జగించే ప్రయత్నాలు ఎక్కడా ఫలించడం లేదని, ఎలా సముదాయించాలో తెలియక నేతలు సతమతం అవుతున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.