దుబ్బాక/దుబ్బాక టౌన్/మిరుదొడ్డి, డిసెంబర్ 1: కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో తల్లీకొడుకు జల సమాధి కాగా వీరిని రక్షించేందుకు బావిలోకి దిగిన గజ ఈతగాడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్ వద్ద బుధవారం చోటుచేసుకున్నది. మెదక్ జిల్లా నిజాంపేట మండలం నందిగామకు చెందిన సూదనం లక్ష్మి(50), తన కొడుకు ప్రశాంత్(26)తో కలిసి కారులో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని కూతురి ఇంట్లో జరిగే బారసాలకు బయలుదేరారు. ప్రశాంత్ కారు నడుపుతున్నాడు. దుబ్బాక మండలం చిట్టాపూర్ శివారులోని చిన్నవాగు వద్దకు రాగానే టైరు పేలడంతో అదుపు తప్పిన కారు రోడ్డు పక్కనే ఉన్న వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది. చుట్టుపక్కల వారు గమనించి భూంపల్లి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన మధ్యా హ్నం ఒంటి గంటకు జరగ్గా.. పోలీసులు, అగ్నిమాపక, విద్యుత్తు సిబ్బం ది, గజ ఈతగాళ్లు సుమారు 7 గంటలపాటు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. మోటర్ల సహాయంతో నీటిని తోడేసి, రెండు భారీ క్రేన్లను వినియోగించారు. ఎమ్మెల్యే రఘునందన్‌రావు, ఏసీపీ దేవారెడ్డి, తది తరులు సహాయక చర్యలను పర్యవేక్షించారు. రాత్రి 8.30 గంటల ప్రాంతంలో కారుతోపాటు తల్లీకొడుకు లక్ష్మి, ప్రశాంత్‌ల మృతదేహాలను వెలికి తీశారు. బావిలోకి దిగిన దుబ్బాక మండలం ఎనగుర్తికి చెందిన గజ ఈతగాడు నర్సింలు(42) ప్రాణాలు కోల్పోయాడు. అతను కారుకు తాడు కట్టే క్రమంలో ఏం జరిగిందో తెలియదు కాని కారుపై శవమై తేలాడు. కారును పైకి తీస్తుండగా అతని మృతదేహం బావిలో పడిపోయింది. చీకటి పడటంతో ఆ మృతదేహాన్ని పైకి తీయలేకపోయారు.