హుజూరాబాద్: అన్ని వర్గాల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని, పనిచేసే ప్రభుత్వానికి ప్రజలంతా అండగా ఉండాలని రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు కోరారు. మంగళవారం మండలంలోని కనుకులగిద్దె గ్రామంలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచానికి దిక్సూచిగా ఉండేలా నిర్మాణం జరిగిందన్నారు. ఉప ఎన్నికల్లో కారు దూసుకుపోతుందని, మంచి మెజార్టీతో గెల్లు శ్రీనివాస్ గెలుస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఉప ఎన్నికలకు కారణమైన ఈటలకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. గతంలో రాజేందర్ కు, రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని, ఆయన ఒక వ్యాపారవేత్తనేనన్నారు. 2004 ఎన్నికల ముందు మాత్రమే ఆయన పార్టీలోకి వచ్చారన్నారు. టీఆర్ఎస్ నుంచి ఆరుసార్లు విజయం సాధించిన ఈటల అదే పార్టీని విమర్శించడం సబబు కాదన్నారు. మంత్రి పదవి ఉంటేనే పార్టీలో కొనసాగుతాడా… లేకుంటే రాజీనామా చేస్తాడా..? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్కు రాజేందర్ చేసింది ఏమిలేదని, ఆయనకే టీఆర్ఎస్ ఎన్నో పదవులు ఇచ్చిందని లక్ష్మీ కాంతారావు అన్నారు. నిత్యావసర సరుకుల ధరలు పెంచి బీజేపీ ప్రభుత్వం సామాన్యులపై భారం మోపుతున్నదన్నారు.
ఉప ఎన్నికల్లో కారు గెలువడం ఖాయమని తెలిపారు. ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఈటల రాజేందర్ కూల్చేందుకు కుట్ర చేశారని ఆరోపించారు. వ్యక్తిగత స్వార్థం కోసమే ఈటల రాజేందర్ రాజీనామా చేశాడన్నారు. తన బాధను ప్రజల బాధలుగా చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ నిండు మనసుతో ఆశీర్వదించి అండగా నిలవాలని కోరారు. ఈ సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ పేరాల గోపాల్‌రావు, వావిలాల ఖాదీ గ్రామోద్యోగ ప్రతిష్ఠాన్ చైర్మన్ కట్టంగూరు రామచంద్రారెడ్డి, తుమ్మల శ్రీరామ్‌రెడ్డి, మాజీ సర్పంచ్ కంకణాల తిరుపతిరెడ్డి, సింగిల్ డైరెక్టర్ కంకణాల రమేష్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ విజయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.