కాసిపేట : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం ముత్యంపల్లి గ్రామ పంచాయతీలోని గుండ్ల పహాడ్ గ్రామంలో ఇంటి ఆవరణలో గంజాయి మొక్కలు ( Cannabis Plants ) పెంచుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు( Arrest ) చేశారు. గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకొని, మొక్కలు పెంచుతున్న మడావి అర్జు ను అరెస్ట్ చేసినట్లు సీఐ పర్స రమేష్, ఎస్సై ఆంజనేయులు తెలిపారు.
ఇంటి ఆవరణలో ఎవరికీ కనిపించకుండా చీరలు కట్టి, చిక్కుడు పొదుల చాటున గంజాయి మొక్కలను పెంచుతున్నాడని వివరించారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న ఎస్సై ఆంజనేయులు, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి నిందితుడి నివాసంపై దాడి చేసి సుమారు 8 అడుగుల ఎత్తు పెరిగిన 5 గంజాయి మొక్కలను పోలీసులు గుర్తించారని వివరించారు.
గంజాయి మొక్కల విలువ సుమారు రూ.50 వేలు ఉంటుందని అంచనా వేసి కేసు నమోదు చేశామన్నారు. సంఘటన స్థలాన్ని బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ సందర్శించారు. గంజాయి క్రయ, విక్రయాలు చేస్తే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు.