నారాయణపేట : నేరాల నియంత్రణకు ( Crime Controll ) సరిహద్దు రాష్ట్రాల మధ్య సహకారం, సమాచారం మార్పిడి ఎంతో అవసరమని కర్నాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా ఎస్పీ అరుణ్స్ గిరి ( SP Arunsgiri ) అన్నారు. బుధవారం రాయచూర్‌లో ఏపీ, తెలంగాణ ( Telangana ) , కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు జిల్లాల పోలీసు అధికారులతో నిర్వహించిన కోఆర్డినేషన్ క్రైమ్ సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల, నారాయణపేట జిల్లాల ప్రతినిధులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా పోలీసు అధికారులు పాల్గొన్నారు.
నారాయణపేట జిల్లా తరఫున మక్తల్ సీఐ రామ్ లాల్, కృష్ణ ఎస్సై ఎస్.ఎం. నవీద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సరిహద్దు ప్రాంతాల్లో చట్టం , శాంతి భద్రతలు కాపాడేందుకు పరస్పర సమన్వయం ఎంతో కీలకమని పేర్కొన్నారు. రాష్ట్రాల మధ్య నేరస్తుల కదలికలను అరికట్టడం, నేరాల నియంత్రణలో సమర్థవంతమైన చర్యలు తీసుకోవడం కోసం సమాచారం పంచుకోవడం అవసరమని అభిప్రాయపడ్డారు.
పరారీలో ఉన్న నేరస్తుల వివరాల పరస్పర వినిమయం, నాన్ బెయిలబుల్ వారెంట్ల అమలు, మిస్సింగ్ కేసుల పరిష్కారం కోసం సమాచార మార్పిడి, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సంయుక్త చర్యలు, గుర్తు తెలియని మృతదేహాల గుర్తింపు, దొంగతనాలు , ఇతర నేరాల నివారణకు ముందస్తు చర్యలపై చర్చించారు. రాష్ట్రాల మధ్య సమన్వయంతో పని చేయడం ద్వారా ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయగలమని వెల్లడించారు.