హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మున్సి‘పోల్స్’ హడావుడి ముగిసింది. ఇక ఫలితాలు రావడమే తరువాయి. పోలింగ్ బాక్సు ల్లో భద్రమైన అభ్యర్థుల భవితవ్యం రేపు తేలిపోనుంది. బుధవారం సా యంత్రం ఎన్నికలు ముగియగా, అభ్యర్థుల ఆరాలు వర్ణనాతీతం. ‘అన్నా. గెలుస్తానే!’ అనే ఒక ప్రశ్న చుట్టూనే ఇప్పుడు అందరి రాజకీయ జీవితం తి రుగుతున్నది.
ఏ బూత్‌లో ఏ వర్గం ఓట్లు ఎటు పడ్డాయి? లాస్ట్ మినిట్‌లో పంపిణీ చేసిన కానుక పనిచేసిందా? లేదా? అన్నది ఇప్పుడు మిలియన్ డాల ర్ల ప్రశ్నగా మిగిలింది. తమ సన్నిహితులు, కార్యకర్తలతో కలిసి అభ్యర్థులు బూత్‌వారీగా పోలింగ్ సరళిపై పోస్టుమార్టం చేస్తున్నారు. వార్డు లీడర్లకు ఫోన్లు చేసి మన కాలనీలో చదువుకున్నోళ్లు ఎటు వేశారు?‘, ‘మహిళలు ఎ వరి వైపు మొగ్గు చూపారు?‘ అని ఆరా తీస్తున్నారు. పోలింగ్ శాతం పెరుగడం తమకు ప్లస్సా? మైనస్సా? అని స్థానిక నేతలను అడిగి తెలుసుకుంటున్నారు.
టీవీల్లో వచ్చే ఎగ్జిట్ పోల్స్ ఒకలా ఉంటే, గ్రౌండ్ లెవల్లో, ఇతర ఏజెన్సీల సర్వేలు మరోలా ఉంటున్నాయి. ‘ఏ సర్వే నమ్మాలో అర్థం కావడం లేదు బాబూ.. మనకు అనుకూలంగా వస్తే సరైన సర్వే అని, వ్యతిరేకంగా వస్తే అ మ్ముడుపోయిన సర్వే అని సరిపెట్టుకోవాల్సి వస్తున్నది‘ అని ఒక అభ్యర్థి నవ్వుతూనే తన ఆవేదన వ్యక్తంచేశారు. మరోవైపు అభ్యర్థుల కంటే ఎకువగా పందెం రాయుళ్లు టెన్షన్ పడుతున్నారు. పట్టణాల్లో అభ్యర్థుల గెలుపోటములపై కోట్లలో బెట్టింగ్‌లు నడుస్తున్నాయి.
మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి పోలింగ్ ముగిసే వరకు పెట్టిన ఖర్చులపై అభ్యర్థులు లెక్కలేసుకుంటున్నారు. నామినేషన్నాడు ఎంత ఖర్చయ్యింది? రోజూ ప్రచారానికి ఎంత ఖర్చు పెట్టాం? ఆరు రోజుల ప్రచారానికి ఎంతయ్యింది? పంచింది ఎంత? ఇతర ప్రచార ఖర్చులు ఎన్ని? ఎక్కడి నుంచి వీటిని తీసుకొచ్చినం? ఎవరెవరికీ ఎంతెంత ఇవ్వాలి? అని చిట్టాపద్దుల బుక్కులు ముందువేసుకొని చూసుకుంటున్నారు. ప్రచార సామగ్రి, టెంట్, వంట, టిఫిన్ సెంటర్ల ఉద్దెర వంటి ఖర్చులను చెల్లిస్తున్నారు. మరోవైపు క్షణం తీరిక లేకుండా, కంటిమీద కునుకు లేకుండా తిరిగిన అభ్యర్థులు కాస్త రిలాక్స్ అవుతున్నారు.