భారతీయ మహిళల్లో క్యాన్సర్ ముప్పు ఎక్కువగా కనిపిస్తున్నది. పురుషులతో పోలిస్తే.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం, చిన్న వయసులోనే మరణించే అవకాశం స్త్రీలలోనే అధికంగా ఉంటున్నది. ముఖ్యంగా.. ఆడవాళ్లలో ఊపిరితిత్తుల క్యాన్సర్ ఆందోళనకరంగా పెరిగిపోతున్నది. ఇండోర్, ఔట్డోర్ వాయు కాలుష్యం.. మహిళల్లో క్యాన్సర్కు కారణం అవుతున్నదని ప్రపంచ ఆరోగ్యసంస్థ చెబుతున్నది. తాజాగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ-ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ నిర్వహించిన సర్వే.. పలు ఆందోళనకర విషయాలను వెల్లడించింది. 2022 విశ్లేషణ ప్రకారం.. ప్రతి లక్ష మంది మహిళల్లో 104.5 మందికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నట్లు చెప్పింది. మరణాల రేటు 64.2గా నమోదైంది. పురుషుల్లో మాత్రం.. క్యాన్సర్ వచ్చే అవకాశం 91.5 ఉండగా.. మరణాల రేటు 62.2గా నమోదైంది. ఆ ఏడాది మనదేశంలో నమోదైన మొత్తం క్యాన్సర్ కేసులు 14,13,316.
ఇందులో 7,12,138 మంది మహిళలు కాగా, 6,91,178 మంది పురుషులు ఉన్నారు. అత్యధికంగా 81,748 మందిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ బయటపడి.. 75,031 మంది మరణాలకు కారణమైంది. అంతేకాకుండా.. లంగ్ క్యాన్సర్ కేసులు ఎక్కువగా 50-74 ఏళ్ల పురుషులలోనే కనిపిస్తాయి. కానీ మహిళల్లో.. ఈ వ్యాధి ముందుగానే వస్తున్నది. సాధారణంగా 45-69 ఏండ్లలోనే లంగ్ క్యాన్సర్ దాడిచేస్తున్నది. ఇందుకు ఇండోర్, ఔట్డోర్ వాయు కాలుష్యమే ప్రధాన కారణమని అధ్యయనకారులు చెబుతున్నారు. బయో ఇంధనాలు, వంట నుంచి వచ్చే పొగకు ఎక్కువగా గురికావడం వల్ల.. మహిళల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్ పెరుగుతున్నదని తెలిపారు. ఇక పేలవమైన చికిత్సా ఫలితాల వల్ల మహిళల్లో మరణాల రేటు కూడా ఎక్కువగా ఉంటున్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని నుంచి బయటపడాలంటే.. మహిళలు వాయు కాలుష్యం బారినపడకుండా ఉండాలని చెబుతున్నారు.