ఎల్లారెడ్డి రూరల్, జనవరి 4: మేతకు వెళ్లిన ఆవుల మందపై పులిదాడి చేయడంతో లేగదూడ మృతి చెందిన ఘటన మండలంలోని సోమార్పేట్లో చోటుచేసుకున్నది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డి మాజీ సర్పంచ్ చెన్నలక్ష్మణ్కు చెందిన అవుల మందను పిప్పిర్యాగడి తండాకు చెందిన రవి శనివారం మేత కోసం సోమార్పేట్ అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లాడు.
మేతకు వెళ్లి తిరిగి వచ్చిన మందలో లేగదూడ కనిపించకపోవడంతో శివారులోని అటవీ ప్రాంతంలో వెతికాడు. ఆదివారం ఉదయం లేగదూడ మృతిచెంది ఉండడం కనిపించింది. సోమార్పేట్ శివారు అటవీప్రాంతంలో పులి ఆనవాళ్లు కనిపించడంతో సోమార్పేట్, పిప్పిర్యాగడితండా ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పశువులను మేతకు తీసుకెళ్లే వారు ఒంటరిగా ఉండకూడదని, గుంపులుగా వెళ్లాలని గ్రామపెద్దలు సూచిస్తున్నారు.