Ashwini Vaishnaw | న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: కులగణనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో చేపట్టనున్న జనాభా లెక్కల సేకరణలోనే కులగణనను కూడా చేర్చాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తామని ప్రకటించింది. ప్రతిపక్ష పార్టీలు కులగణనను తమ రాజకీయ స్వార్థం కోసం వాడుకుంటున్నాయని విమర్శించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. కాంగ్రెస్‌తోపాటు పలు ప్రతిపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రధాన ఎన్నికల అంశంగా దీన్ని మార్చాయి. తెలంగాణతోపాటు బీహార్, కర్ణాటకలో ఇప్పటికే వెనుకబడిన కులాల సర్వే నిర్వహించారు. కర్ణాటకలో కులగణనపై వొక్కలిగ, లింగాయత్‌కు చెందిన వారు అభ్యంతరాలు వ్యక్తంచేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముంగిట కేంద్రం కులగణన చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
కులగణన కేంద్ర అంశం
జనగణన, కులగణన అంశాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తాయని మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టంచేశారు. కొన్ని రాష్ర్టాల్లో అక్కడి ప్రభుత్వాలు కులగణన పేరిట సర్వేలు చేయించాయని, ఆ సర్వేల్లో పారదర్శకత లేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన ప్రక్రియ సమాజం సందేహాలను రేకెత్తించిందని అన్నారు. స్వాతంత్య్రానంతరం పలుమార్లు జరిగిన జనగణనలో ఎన్నడూ కులగణనను చేర్చలేదని ఆయన గుర్తుచేశారు. కులగణనకు బద్ధ వ్యతిరేకి అయిన కాంగ్రెస్ ఆ అంశాన్ని తన రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నదని విమర్శించారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని, రాజకీయాల కారణంగా సామాజిక నిర్మాణం చెదిరిపోవద్దన్న ఉద్దశంతో సర్వేలకు బదులుగా కులగణనను జనాభా లెక్కల్లో చేర్చాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.
కులగణన ద్వారా దేశ సామాజిక, ఆర్థిక సాధికారత సాధ్యమవుతుందని, దేశం మరింత పురోగతి చెందుతుందని పేర్కొన్నారు. ప్రతిపక్షపార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో రాజకీయ కారణాలతో కులాల సర్వే నిర్వహించారని ఆరోపించారు. తదుపరి దేశవ్యాప్తంగా చేపట్టే జనాభా లెక్కల ప్రక్రియలో కులగణనను చేర్చి పారదర్శకంగా నిర్వహించాలన్నదే మోదీ ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు. జనగణన ప్రక్రియను 2020 ఏప్రిల్‌లోనే చేపట్టాల్సి ఉన్నప్పటికీ కొవిడ్ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. పదేండ్లకోసారి చేపట్టే జనగణనను సకాలంలో నిర్వహించి ఉంటే 2021 నాటికి పూర్తి వివరాలు వెల్లడయ్యేవి.
కులగణనకు కాంగ్రెస్ వ్యతిరేకం
కాంగ్రెస్ ప్రభుత్వాలు కులగణనకు ఎన్నడూ మద్దతివ్వలేదని అశ్వినీ వైష్ణవ్ ఆరోపించారు. కులగణన అంశంపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయిస్తామని 2010లో నాటి ప్రధాని మన్మోహన్సింగ్ లోక్‌సభలో హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఆ తరువాత పలు రాజకీయ పార్టీలు కులగణన చేపట్టాలని సిఫారసు చేయడంతో మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. అయినప్పటికీ నాటి కాంగ్రెస్ ప్రభుత్వం కులగణనకు బదులుగా సర్వేలు మాత్రమే చేయాలని నిర్ణయించిందని విమర్శించారు. కాంగ్రెస్‌తోపాటు దాని ఇండియా కూటమిలోని పార్టీలు కులగణన అంశాన్ని రాజకీయ అస్త్రంగానే వాడుకున్నాయని దుయ్యబట్టారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 246 ప్రకారం ‘జనగణన’ అంశం కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తుందని చెప్పారు. కానీ కొన్ని రాష్ర్టాలు రాజకీయ కోణంలో ఎటువంటి పారదర్శకత లేకుండా కులాలను లెక్కించడానికి సర్వేలు నిర్వహించాయని అన్నారు. అతిత్వరలో జనగణన చేపడతామని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా గత ఏడాది చివరిలో ప్రకటించినప్పటికీ ఆ ప్రక్రియను ఎప్పుడు ప్రారంభిస్తారన్న దానిపై మాత్రం ఇప్పటివరకు స్పష్టత రాలేదు.
స్వాగతించిన నితీశ్‌కుమార్
కులగణన చేపట్టాలన్న నిర్ణయాన్ని సీఎం నితీశ్‌కుమార్ స్వాగతించారు. తాము ఎప్పటినుంచే ఈ డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. కులగణన ద్వారా ఆయా వర్గాలలోని ప్రజల సంఖ్య వెల్లడవుతుందని, తద్వారా వారి అభ్యున్నతికి, అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించవచ్చని అభిప్రాయపడ్డారు. బీహార్ ప్రభుత్వం 2023 అక్టోబర్‌లోనే తమ రాష్ర్టానికి సంబంధించిన కులగణన నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు కులగణనపై నిర్ణయం తీసుకున్నదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు.