హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఐపీఎస్ (రిటైర్డ్) అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు బుల్లెట్‌ప్రూఫ్ వాహనాన్ని తొలగించిన అంశంలో చెలరేగిన దుమారాన్ని కప్పిపుచ్చుకొనేందుకు.. పోలీసుశాఖ ఇం కొందరిని బలిచేసింది. రాష్ట్రంలో రిటైరైన డీజీపీలు, ఐపీఎస్ అధికారులకు, ప్రస్తు తం విధుల్లో కొనసాగుతున్న ఐపీఎస్‌లకూ అదనపు భద్రతను కుదిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీచేశారు. దాదాపు 26 మంది మాజీ, ప్రస్తుత పోలీస్ ఉన్నతాధికారులకు కేటాయించిన బుల్లెట్‌ప్రూఫ్ వాహనాలను, ఎసార్ట్ భద్రతను పూర్తిగా తొలగించినట్టు విశ్వసనీయ సమాచారం.
ప్రభుత్వ నిర్ణయం కారణంగా భద్రతా వాహనాలు కోల్పోతున్న వారిలో.. మాజీ డీజీపీలు/ఉన్నతాధికారులు.. స్వరణ్‌జిత్ సేన్, ఏకే ఖాన్, ఏకే మహంతి, దినేశ్‌రెడ్డి, జితేందర్, మహేందర్‌రెడ్డి, అనురాగ్ శర్మ, పూర్ణచంద్రరావు ఉన్నట్టు తెలిసింది. వారితోపాటు కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, నవీన్‌చంద్, డానియల్, వెంకట్రామిరెడ్డి, స్టీఫెన్ రవీంద్ర, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, డీటీ నాయక్, ఉమేశ్ షరాఫ్, రవి గుప్తా కూడా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న విజయకుమార్‌కు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను తొలగించినట్టు వార్తలు వెలుడుతున్నాయి. దీనిపై ఇంటెలిజెన్స్ అధికారుల నుంచి వివరణ కోరేందుకు ‘నమస్తే తెలంగాణ’ ప్రయత్నించగా.. ఎవ్వరూ స్పందించలేదు.
భద్రత కుదింపు కేవలం పోలీస్ అధికారులకే పరిమితం కాలేదు. రాష్ట్రంలో దా దాపు 31 మంది రాజకీయ నాయకులకు కూడా తొలగించినట్టు తెలిసింది. చాలావరకు వీఐపీల భద్రతను కేవలం 1+1 గన్‌మెన్లకే పరిమితం చేస్తూ పోలీస్ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నక్సలిజం ఉన్న సమయంలో ఈ అధికారులకు ప్రాణహాని ఉన్న నేపథ్యంలో భారీ భద్రత కల్పించారు.