
ఇబ్రహీంపట్నం : ఇక్కడ పుణ్యస్నానాలాచరిస్తే అన్ని శుభాలే కలుగుతాయని ఈ ప్రాంత ప్రజల నమ్మకం. ఆ నమ్మకంతోనే ఈ ప్రాంతానికి చెందిన ప్రజలు ఎక్కడున్నా కార్తీక మాసంలో నిర్వహించే 15 రోజుల జాతరకు వచ్చి గుండంలో స్నానాలాచరించి తమ మొక్కలు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తుంది. పదిహేను రోజులపాటు నిర్వహించే బుగ్గరామలింగేశ్వరస్వామి జాతరకు రంగారెడ్డి, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, నల్గొండ జిల్లాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున విచ్చేసి బుగ్గరామలింగేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేసి తమ కోర్కెలను తీర్చుకుంటున్నారు. రెండేళ్లుగా కరోనా ప్రభావంతో జాతరకు భక్తులు రావటం తగ్గిపోయింది.
గత సంవత్సరం కరోనా తీవ్రతవలన ఉత్సవాలను నిలిపివేశారు. దీంతో భక్తులు బుగ్గరామలింగేశ్వరస్వామి కృపకు పాత్రులు కాలేకపోయారు. ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం రంగారెడ్డిజిల్లా, మంచాల మండలంలోని ఆరుట్ల గ్రామ పంచాయతీ పరిధిలోని బుగ్గతండా సమీపంలో ఉంది. ఈ ఆలయంలో తూర్పునుంచి పడమరకు నీరు ప్రవహించడం ఇక్కడి ప్రత్యేకత. ఈ ఆలయంలో ప్రవహించే నీటిలో స్నానం ఆచరించి రామలింగేశ్వరస్వామిని దర్శించుకుంటే అన్ని శుభాలే జరుగుతాయని ఈ ప్రాంత ప్రజల గట్టి నమ్మకం. ఈ నమ్మకంతోనే ఈ ప్రాంతానికి చుట్టుపక్కల ఉన్న జిల్లాల నుంచి భక్తులు ఎన్ని ఇబ్బందులెదురైనా వచ్చి దర్శించుకుని మొక్కలు తీర్చుకుంటారు. కార్తీక పౌర్ణమినుంచి అమావాస్య వరకు పదిహేను రోజులపాటు ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలో కార్తీక మాసంలో సత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహించడం ఎంతో ప్రసిద్ధి. ఇక్కడ వ్రతం నిర్వహిస్తే అనుకున్న కోర్కెలు తీరుతాయని నమ్మకం.

రామలింగేశ్వరస్వామి ఆలయానికి చేరుకునే మార్గం..
మంచాల మండలంలోని ఆరుట్ల గ్రామ పంచాయతీ పరిధిలోగల స్వామి వారి ఆలయానికి భక్తులు చేరుకోవడానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. నగరంతో పాటు వివిధ ప్రాంతాలకు చెందినవారు బస్సుల ద్వారా ఇబ్రహీంపట్నం చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రతి 30నిమిషాలకొక్క ఆర్టీసీ బస్సు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్సుతో పాటు ఇబ్రహీంపట్నం మంచాల రోడ్డు నుంచి ప్రైవేటు ఆటోలు, జీపులు, ఇతర వాహనాలు బుగ్గజాతరకు ప్రయాణికులను చేరవేస్తున్నాయి. అలాగే, ఇబ్రహీంపట్నం నుంచి మంచాల, ఆరుట్ల మీదుగా రామలింగేశ్వరస్వామి ఆలయానికి చేరుకునే మార్గాలున్నాయి.
వ్రతాలు, వనభోజనాలకు ప్రాముఖ్యత..
బుగ్గరామలింగేశ్వరస్వామి ఆలయంలోని గుండంలో స్నానాలు ఆచరించి వ్రతాలు నిర్వహిస్తే అనుకున్న కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం. కార్తీక మాసంలో ఇక్కడ వ్రతాలను చేసుకుని భక్తులు కుటుంబ సమేతంగా సామూహిక వనభోజనాలను చేసుకుంటారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ ప్రాంతంలో గడిపి తిరిగి వెల్లిపోతుంటారు. చుట్టూ ఎత్తైన కొండల మధ్యన ఉన్న స్వామి ఆలయం ఆహ్లాదకర వాతావరణాన్ని అందిస్తుంది.