అనంతగిరి, మార్చి 21 : రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఆర్భాటంగా ప్రవేశపెట్టిన రూ.3,24,234 కోట్ల బడ్జెట్‌పై సీపీఐ సూర్యాపేట జిల్లా కార్యవర్గ సభ్యుడు బద్దం కృష్ణారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర బడ్జెట్‌పై శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రామీణ ఉపాధి పనుల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం వాటా 40 శాతం నిధులు కేటాయించకపోవడం, పింఛన్ల పెంపు గురించి ఒక్క మాట కూడా ప్రస్తావించక పోవడం గ్రామీణ వ్యవసాయ కార్మికులను మోసం చేయడమేనన్నారు. పెండింగ్‌లో ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం, కొత్తగా ఇవ్వనున్న ఇందిరమ్మ ఇళ్ల కోసం ఈ బడ్జెట్లో ఒక్క పైసా కూడా కేటాయించలేదని విమర్శించారు. ఆరు గ్యారంటీల అమలుకు నిధులు కేటాయిస్తారనే ఆశించినా నిరాశే మిగిలిందన్నారు. భూమిలేని వ్యవసాయ కార్మికులకు రూ.12 వేల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చి కేవలం రూ.6 వేల కోట్లే కేటాయించడం సరిపోదన్నారు.
కౌలు రైతులకు రూ.15 వేలు, , ప్రతి మహిళకు రూ.25 వేల ఆర్థిక సాయం, తులం బంగారం వంటి హామీలపై ఆర్థిక శాఖ మంత్రి ఎలాంటి ప్రస్తావన చేయలేదన్నారు. రేషన్ కార్డుల విషయంలో ప్రభుత్వం 15 లక్షల కొత్త కార్డులు ఇచ్చామని చెప్పినా, పాత కార్డుల్లో పేర్లు పెంచినప్పటికీ అదనపు నిధులు కేటాయించలేదని విమర్శించారు. భూ నిర్వాసితుల పునరావాస ప్యాకేజీపై కూడా స్పష్టత లేకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఈ బడ్జెట్ పూర్తిగా గ్రామీణ పేదలను విస్మరించిందన్నారు. వెంటనే రైతు బంధు విడుదల చేసి రైతులకు పెట్టుబడి సహాయం అందించాలని డిమాండ్ చేశారు. అలాగే దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సాదా బైనామాల సమస్యలను కూడా పరిష్కరించాలని కోరారు.