దుండిగల్, మే 24: భార్యపై అనుమానం పెనుభూతంగా మారింది. వివాహమైన నాటినుంచే హింసించడం మొదలుపెట్టాడు. సైకోగా మారిన అతడు భార్యను కిరాతకంగా హతమార్చాడు. ఆపై ఆమె ప్రమాదవశాత్తు చనిపోయిందని నమ్మించేందుకు కుట్రపన్నాడు. అనంతరం తన స్నేహితుడి వద్దకు వెళ్లి విషయం చెప్పి, కత్తితో పొడుచుకున్నాడు. స్నేహితుడు 100 డయల్ చేసి విషయాన్ని పోలీసులకు చెప్పగా.. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బాచుపల్లి పీఎస్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతురాలి తల్లిదండ్రులు కథనం ప్రకారం.. బాచుపల్లి సాయి అనురాగ్కాలనీలోని ఎంఎస్ఆర్ ప్లాజా, బీ బ్లాక్‌లోని 101 ప్లాజాలో ఉంటున్న నాగేంద్ర భరద్వాజ్(31), మధులత(29) దంపతులు. 2020, ఫిబ్రవరి 15న వీరి వివాహమైంది. వీరికి 17 నెలల కుమారుడు శ్రీజై ఉన్నాడు. దంపతులిద్దరూ హైటెక్‌సిటీలో వేర్వేరు చోట సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. పెండ్లి అయినప్పటి నుంచి నాగేంద్ర భరద్వాజ్ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉంది. భార్యను పుట్టింటికి వెళ్లకుండా, ఎవరితో మాట్లాడకుండా హింసించాడు. అదనపు కట్నం కోసం వేధించాడు. దీంతో దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో శ్రీజై కాన్పు కోసం మధులత తన పుట్టింటికి వెళ్లగా.. కొడుకు పుట్టినప్పటికి కనీసం చూడడానికి వెళ్లలేదు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో పెద్దల సమక్షంలో పంచాయతీ జరుగగా.. భార్యను మంచిగా చూసుకుంటానని చెప్పి కాపురానికి తీసుకొచ్చుకున్నాడు. అయినప్పటికీ అతడి ప్రవర్తనలో మార్పు రాకపోగా.. భార్యపై వేధింపులు ఎక్కువయ్యాయి.
నిత్యం భార్యను చిత్రహింసలు, వేధింపులకు గురిచేస్తూ పైశాచిక ఆనందం పొందే నాగేంద్ర భరద్వాజ్..ఈ నెల 4న ఉన్మాదిలా మారాడు. అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో భార్యపై దాడిచేసి, కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపాడు. గొంతులోనూ కత్తిని దింపాడు. ఆపై ఆమె శరీరాన్ని ముక్కలుగా కోసేందుకు యత్నించి విఫలమయ్యాడు. కుడికాలు మోకాలి కింద కట్‌చేసి, కాలుని వేరు చేశాడు. అంతటితో ఆగని నాగేంద్ర భరద్వాజ్.. ప్రమాదవశాత్తు మధులత మరణించినట్లు చిత్రీకరించేందుకు ఇంట్లో ఉన్న రెండు వంటగ్యాస్ సిలిండర్లను ఓపెన్ చేసి గ్యాస్లీకయ్యేలా చేశాడు. ఆపై విద్యుత్ స్విచ్ బోర్డులో రెండు వైర్లను పెట్టి షార్ట్ సర్క్యూట్ జరిగేలా ఏర్పాటు చేశాడు. అనంతరం తన కొడుకును తీసుకుని ఇంట్లోంచి బయటకు వెళ్లాడు.
నాగేంద్ర భరద్వాజ్ నేరుగా చందానగర్‌లో ఉంటున్న తన స్నేహితుడు శ్రీనివాసులు ఇంటికి వెళ్లాడు. జరిగిన విషయాన్ని అతడికి చెప్పి.. తాను కత్తితో ఛాతీలో పొడుచుకున్నాడు. శ్రీనివాసులు వెంటనే నాగేంద్ర భరద్వాజ్‌ను సమీపంలోని ప్రైవేట్ వైద్యశాలలో చేర్పించి, డయల్ 100కు ఫోన్ చేశాడు. విషయం తెలుసుకున్న బాచుపల్లి పోలీసులు నిందితుడిని 6న అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే, ఇప్పటి వరకు ఈ ఘటన బయటకు రాకుండా పోలీసులు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది.