చెన్నూర్/భీమారం/కాగజ్నగర్, డిసెంబర్ 2 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు సోమవారం మంచిర్యాల జిల్లాలో చేపట్టిన గురుకులాల బాటను పోలీసులు, ప్రిన్సిపాళ్లు అడ్డుకోవడంపై పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. చెన్నూర్ పట్టణంలోని మైనార్టీ గురుకుల పాఠశాల సందర్శనకు వెళ్లిన బీఆర్ఎస్వీ నాయకులను పోలీసులు, గురుకుల పాఠశాల సిబ్బంది అడ్డుకోవడంపై మండిపడ్డారు. మైనార్టీ గురుకుల పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ పట్టణ అధ్యక్షుడు నయాబ్ మాట్లాడుతూ వసతి గృహాల్లోని వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే పోలీసులు అడుగడుగునా తమను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. భీమారంలోని కేజీబీవీని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారిశెట్టి విద్యాసాగర్ నాయకులతో కలిసి వెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు. లోపలికి అనుమతించకపోవడంతో అక్కడే బైఠాయించారు. సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని జ్యోతి బాపూలే, గన్నారంలోని జ్యోతిబా పూలే విద్యాలయాలను బీఆర్ఎస్ నియోజకవర్గ కన్వీనర్ లెండుగురే శ్యాంరావు, బీఆర్ఎస్వీ జిల్లా ఇన్చార్జి ముస్తాఫా నాయకులతో కలిసి సందర్శించారు. ఆపై సిర్పూర్ (టీ) మండల కేంద్రంలోని గురుకుల విద్యాలయానికి వెళ్లగా, పోలీసులు అడ్డుకోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ, గేటు ఎదుట బైఠాయించారు.