నారాయణపేట : గోదావరిలో తెలంగాణ నీటి వాటా తేల్చేవరకు ఆంధ్ర బనకచర్ల ( Banakacharla ) అడ్డుకుంటాం అనే నినాదంతో కళాశాల విద్యార్థుల్లో అవగాహన (BRSV Campaign) పెంచేందుకు బీఆర్ఎస్వీ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా మంగళవారం నారాయణ పేట జిల్లా కేంద్రంలోని స్థానిక శ్రీ వేద సరస్వతి జూనియర్ (SVS) కాలేజీలో విద్యార్థులకు అవగాహన కల్పించారు.
కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ పార్టీల వల్ల బనకచర్ల ప్రాజెక్ట్‌తో గోదావరి నదిలో తెలంగాణ 200 టీఎంసీల నీటి వాటా కోల్పోయే పరిస్థితిని తీసుకొచ్చి , తెలంగాణ ప్రాంత ప్రజలకు చేస్తున్న అన్యాయాన్ని కరపత్రాల ద్వారా వివరించారు. పోలవరం ప్రాజెక్టు నుంచి 200 టీఎంసీల గోదావరి జలాలను రాయలసీమకు తరలించడం కోసం ఏపీ నిర్మించతలపెట్టిన అక్రమ ప్రాజెక్ట్ పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టు అని ఆరోపించారు.
గోదావరి, కృష్ణా నదుల యాజమాన్య బోర్డులు, కేంద్ర జల సంఘం అనుమతులు లేకుండా, అపెక్స్ కౌన్సిల్లో చర్చ జరగకుండా ప్రాజెక్టు నిర్మించవద్దని నిబంధనలు ఉన్నప్పటికీ ఏపీ సీఎం చంద్రబాబు ఇవేవీ లెక్కచేయకుండా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని తుంగలో తొక్కుతూ బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నాడని విమర్శించారు. ఈ అక్రమ ప్రాజెక్టును బీజేపీ అడ్డుకోకపోగా పూర్తి సహకారం అందిస్తు, ప్రాజెక్టుకు కావాల్సిన నిధులు కూడా సమకూరుస్తుందని విద్యార్థులకు వివరించారు.
తెలంగాణ నీటి హక్కులు కాపాడాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ చంద్రబాబుకు లొంగిపోయి లోపాయకారిగా సహకరిస్తున్నాడని టీఆర్ఎస్వీ నాయకులు పేర్కొన్నారు. ఢిల్లీ వేదికగా హై లెవల్ కమిటీకి ఒప్పుకుంటూ సీఎం రేవంతు పెట్టిన సంతకం తెలంగాణ రైతుల పాలిట మరణశాసనం కానున్నదని వెల్లడించారు. ప్రజలు మేలుకోనకపోతే తెలంగాణ శాశ్వతంగా నష్టపోతుందని అన్నారు. కండ్లముందు గోదావరి పారుతున్నా మన పొలాలకు మలుపుకోలేని పరిస్థితి మళ్లీ దాపురిస్తుందని అన్నారు.
కోటి జనాభాకు పైగా ఉన్న హైదరాబాదు మహానగర ప్రజలకు తాగు నీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రైతులు ఇక ఎప్పటికీ బోర్లపైనే ఆదారపడవలసి వస్తుందని, ఇక ఆత్మహత్యలే శరణ్యమని తెలిపారు. ఇటువంటి పరిస్థితి రాకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి విద్యార్థులపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ జిల్లా నాయకులు కోరం శివ రాజ్‌రెడ్డి, కోలు నరేష్ ముదిరాజ్, నారాయణపేట నియోజకవర్గ ఇన్చార్జి స్టీఫెన్, ఎండీ సమీర్ , ఎండీ అసిఫ్, అనిల్ కుమార్, సాయికృష్ణ, బాబు, వినయ్ కుమార్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, నరేష్, రెహమాన్, నాయకులు పాల్గొన్నారు.