KTR | ములుగు : ములుగు మున్సిపాలిటీలో జీతాలు ఇవ్వడంలేదని ఇటీవల ఆత్మహత్య చేసుకున్న పారిశుధ్య కార్మికుడు మహేష్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. మహేశ్ కుటుంబానికి కేటీఆర్ రూ.5,50,000 ఆర్థిక సహాయం చేశారు. ఈ మేరకు బాధితుడి కుటుంబానికి ములుగు బీఆర్ఎస్ నాయకురాలు బడే నాగజ్యోతి చెక్కును అందజేశారు.
‘ములుగులో మున్సిపల్ పారిశుధ్య కార్మికుడు మైదం మహేశ్‌ది ఆత్మహత్య కాదు.. ముమ్మాటికీ సర్కారు హత్యే’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. ఆరు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతోనే మహేశ్ పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. బలవన్మరణానికి అసమర్థ కాంగ్రెస్ సర్కారే కారణమని విమర్శించారు. ఇందుకు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి సీతక్క బాధ్యత వహించి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
కేటీఆర్ ఆదేశాల మేరకు రెడ్కో మాజీ చైర్మన్ వై సతీశ్‌రెడ్డి ఈ నెల 7వ తేదీన ములుగు జిల్లా మాధవరావుపల్లి గ్రామంలోని మృతుడి ఇంటికి చేరుకొని బాధిత కుటుంబాన్ని పరామర్శించిన సంగతి తెలిసిందే. కేటీఆర్‌తో మహేశ్ తల్లి, ఇతర కుటుంబ సభ్యులను మాట్లాడించారు. ఈ సందర్భంగా మహేశ్ మృతికి గల కారణాలను కేటీఆర్ తెలుసుకున్నారు. అధైర్యపడవద్దని అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మహేశ్ మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. అంతకుముందు మహేశ్ మృతిపై కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. 6 నెలలుగా వేతనాలందక పోవడంతోనే మహేశ్ ఆత్మహత్య చేసుకున్నాడని, కాంగ్రెస్ పాలనలో మున్సిపల్ సిబ్బందికి కనీసం వేతనాలు చెల్లించలేని దుస్థితి నెలకొనడం బాధాకరమని పేర్కొన్నారు. మంత్రి సీతక్క నియోజకవర్గమైన ములుగులో జరిగిన ఈ దారుణ ఘటనకు సీఎం, మంత్రిదే బాధ్యతని తేల్చిచెప్పారు.
జీతాలు ఇవ్వక పారిశుధ్య కార్మికుడిని బలి తీసుకున్న కాంగ్రెస్ సర్కార్
కార్మికుడి కుటుంబానికి అండగా నిలిచిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
గత కొన్ని నెలలుగా జీతాలు రాక కుటుంబ పోషణ భారమై ఆత్మహత్య చేసుకున్న ములుగు మున్సిపాలిటీ పారిశుధ్య కార్మికుడు మహేష్ కుటుంబానికి రూ. 5.5… pic.twitter.com/KV3RDJ3MRv
— BRS Party (@BRSparty) September 16, 2025