హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణ సాధకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఈ దుర్మార్గపు వైఖరేంది రేవంత్‌రెడ్డీ?’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. కేసీఆర్ స్వయంగా తానుంటున్న నివాసం అడ్రస్ సహా పోలీసులకు సమాధానం ఇచ్చాక కూడా ఆయన లేని నివాసానికి రాత్రిపూట వచ్చి గేటుకు నోటీసులు అంటించి పైశాచిక ఆనందం పొందడం దారుణమని మండిపడ్డారు. ఇది అహంకారం కాకుంటే మరేమిటి? అని నిలదీశారు. 65 ఏండ్లు దాటిన వ్యక్తులను వారుంటున్న నివాసం వద్దనే విచారించాలన్న నిబంధనను కూడా పోలీసులు అతిక్రమిస్తున్నారని ఆక్షేపించారు.
‘అసలు మీ పోలీసులకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ మీద అవగాహన ఉన్నదా? లేక మీ చేతిలో కీలుబొమ్మల్లా ఇట్లా ప్రతిపక్ష నాయకులను వేధించడమే పనా? చట్టం, న్యాయం, ధర్మం మీద మీకు గౌరవం లేకపోవచ్చు. కానీ మాకు వాటిమీద పూర్తి విశ్వాసం ఉన్నది. ఈ అక్రమ కేసులన్నీ ఛేదిస్తాం. మీ ప్రతి తప్పుడు పనినీ వెలికితీసి తెలంగాణ ప్రజల ముందు పెడుతాం. మీరెన్ని వేధింపులకు పాల్పడుతున్నారో ప్రజలు గమనిస్తున్నరు. సమయం వచ్చినప్పుడు తప్పకుండా మీకు ప్రజాక్షేత్రంలో వారు బుద్ధి చెప్తరు’ అని శనివారం ఓప్రకటనలో హెచ్చరించారు.
నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో బీజేపీకి గట్టి దెబ్బ తగిలింది. సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ నేతృత్వంలో బీజేపీ సీనియర్ నేత, రాష్ట్ర కార్యవర్గ మాజీ సభ్యుడు రికాల ఇంద్రసేనారెడ్డి తన అనుచరులతో కలిసి శనివారం బీఆర్ఎస్లో చేరారు. ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసంలో ఇంద్రసేనారెడ్డికి బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ కండువా కప్పి ఆత్మీయంగా ఆహ్వానించారు. క్షేత్రస్థాయిలో బలం ఉన్న నేత పార్టీలోకి రావడం వల్ల ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ మరింత బలోపేతమవుతుందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే తిప్పని విజయసింహారెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్ గుజ్జ దీపికా యుగేంధర్‌రెడ్డి, ఆపాబ్ మాజీ చైర్మన్ ఎడవెల్లి విజేందర్‌రెడ్డి పాల్గొన్నారు.