మహబూబ్ నగర్ : నీట్లో జరిగిన అక్రమాలపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ( Minister Dharmendra Pradhan ) తన పదవికి రాజీనామా చేసే వరకు , పేపర్ లీక్ చేసే వారికీ కఠిన శిక్షలు పడే వరకు బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ( Srinivas Goud ) వెల్లడించారు. ఢిల్లీలో విద్యార్థి, యువతపై కేంద్ర ప్రభుత్వ అణిచివేతకు వ్యతిరేకంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో గురువారం బీఆర్ఎస్ ఆధ్వార్యాన నిరసన ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీలో పాల్గొన్న మాజీ మంత్రి మాట్లాడుతూ పేపర్ లీకేజిలతో పిల్లల భవిష్యత్తుపై తల్లి తండ్రులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. ఇప్పటి వరకు 150 సార్లు పేపర్లు లీక్ అయితే బాద్యులపై కేంద్రం కఠిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఢిల్లీలో విద్యార్థి, యువకులపై పోలీసులు లాఠీలతో ఇష్టం వచ్చినట్టు కొడుతున్నా బీజేపీ,కాంగ్రెస్ పట్టించుకోవడం లేదని విమర్శించారు.
కాక్రోచ్ పార్టీ ఆందోళనలో విద్యార్థులు, యువత కదిలి రావడంతో రాహుల్ గాంధీ హడావుడిగా మద్దతు తెలుపుతూ నిరసన వ్యక్తం చేశారని పేర్కొన్నారు. నీట్ పరీక్షాల నిర్వహణ బాధ్యతలు రాష్ట్రాలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అక్రమాలను అరికట్టాలంటే రాష్ట్రాలకు అధికారం ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలో ఫీజు రియంబర్స్ మెంట్ పథకం మూసి వేయడంతో పేద విద్యార్థులు ఆందోళనలో ఉన్నారని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాల్యా నాయక్, నాయకులు అభిలాష్ రావు, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, ముడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, పట్టణ అధ్యక్షులు శివరాజ్, మహబూబ్ నగర్ మండల అధ్యక్షులు దేవేందర్ రెడ్డి, హన్వాడ మండల అధ్యక్షులు కరుణాకర్ గౌడ్, మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ ఆంజనేయులు, కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.