హైదరాబాద్ : జంటనగరాల్లో నెలకొన్న తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఖైరతాబాద్‌లోని జలమండలి ( Jalamandali ) కార్యాలయం వద్ద ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ( MLA Sudheer Reddy ) ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ధర్నా (BRS Dharna ) నిర్వహించారు. హైదరాబాద్ నగర ప్రజలు తాగునీటి కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, నీళ్లు రావడం లేదని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా.. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
నీటి సరఫరాను మెరుగుపర్చకపోతే ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ప్రజల బతుకులు బాగుపడతాయన్న ఆశతో ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించారని తెలిపారు. కేవలం నీటి సమస్యనే పరిష్కరించకపోతే పరిపాలన ఎలా చేస్తారని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన మిషన్ భగీరథను స్ఫూర్తిగా తీసుకుని నగరంలో నీటి సరఫరాను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు.
పాలకులకు, అధికారులకు అనుభవరాహిత్యంతో ప్రజలు ఇక్కట్టు పడుతున్నారు. హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్‌కు ప్రజాప్రతినిధులు ఎవరూ లేకపోవడంతో బీఆర్ఎస్ ప్రతినిధులున్న ప్రాంతాలవైపు చిన్నచూపు చూస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, మహిళలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
