భీమారం/మంచిర్యాల అర్బన్, ఏప్రిల్ 20 : మంచిర్యాల జిల్లాలో బీఆర్ఎస్ సోషల్‌మీడియా వారియర్‌పై కాంగ్రెస్ నేతలు దాడిచేశారు. త్రుటిలో వారి నుంచి తప్పించుకున్న బాధితుడు దవాఖానలో చికిత్సపొందుతున్నాడు. చెన్నూర్ నియోజకవర్గం భీమారం మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ సోషల్‌మీడియా వారియర్ సుంకరి గోపాల్ ముదిరాజ్ ఆదివారం రాత్రి తనపై దాడి జరిగినన తీరును వివరించారు. భీమారం పంచాయతీ నిధులను సర్పంచ్ ఉష్కమల్ల విజయలక్ష్మి భర్త, ఉష్కమల్ల పున్నం చందు, ఉష్కమల్ల శ్రీనివాస్‌తోపాటు మరికొందరి ఖాతాల్లోకి మళ్లించారని, మంత్రి వివేక్ ఇచ్చిన హామీలు అమలు కావడంలేదని వారం నుంచి సోషల్‌మీడియాలో ప్రశ్నిస్తున్నట్టు ఆయన తెలిపారు.
సోమవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు గ్రామస్తుల సహకారం కోరానని, ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకుడు ఉష్కమల్ల పున్నం చందు అనుచరులతో కలిసి తనను హత్య చేసేందుకు పథకంవేశారని గోపాల్ చెప్పారు. ఆదివారం రాత్రి ఇప్పలబొగుడ నీళ్లట్యాంక్ వద్దకు తీసుకెళ్లి కొట్టడంతోపాటు హత్య చేసేందుకు యత్నించగా తప్పించుకొని ఆవుడం క్రాస్‌రోడ్డు వద్దకు వచినట్టు పేర్కొన్నారు. అక్కడ టీ స్టాల్ వద్ద పోలీసుల ముందే మరోసారి తనపై కాంగ్రెస్ నాయకులు దాడిచేశారని వెల్లడించారు. సమాచారం అందుకున్న ఎస్సై రాజేందర్ ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టినట్టు చెప్పారు. ఈ విషయమై అదేరోజు రాత్రి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు గోపాల్ తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన ఆవుల సురేశ్ యాదవ్, బర్ల మహేశ్, వేల్పుల నాగరాజు, వేల్పుల శేఖర్, బోయిన మహేశ్, కొమ్ము కుమార్, సందనవేణి మల్లేశ్, తరణ్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రాజేందర్ తెలిపారు.
గోపాల్‌పై దాడిచేసిన నిందితులను అరెస్టుచేసి శిక్షించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ డిమాండ్ చేశారు. సోమవారం మంచిర్యాల ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్న గోపాల్‌ను మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కలగూర రాజ్‌కుమార్‌తో కలిసి పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. బీఆర్ఎస్ అండగా ఉంటుందని బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చారు. అనంతరం బాల్క సుమన్ మీడియాతో మాట్లాడుతూ.. గోపాల్‌పై దాడిచేసిన కాంగ్రెస్ గూండాలను అరెస్ట్ చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి చెన్నూర్ నియోజకవర్గంలో మంత్రి వివేక్ నేతృత్వంలో అరాచకాలు, దౌర్జన్యాలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడేండ్లవుతున్నా ఆరు గ్యారెంటీలు నెరవేర్చలేదని పేర్కొన్నారు.
చెన్నూర్‌లో ఎమ్మెల్యేగా గెలువడానికి సొంతంగా ఇచ్చిన హామీలు ఏమయ్యాయని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సోషల్‌మీడియా వేదికగా ప్రజల తరఫున ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లాలో పోలీసులు విశాఖ ఇండస్ట్రీస్ ఉద్యోగుల్లా వ్యవహరిస్తున్నారని, వివేక్ తొత్తులుగా మారారని, కాంగ్రెస్ కార్యకర్తల్లా పని చేస్తున్నారని ఆరోపించారు. ఈ దాడిపై పెద్దఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నప్పటికీ డీజీపీ, రామగుండం సీపీ, మంచిర్యాల డీసీపీ, జైపూర్ ఏసీపీ స్పందించలేదని మండిపడ్డారు. చెన్నూర్ నియోజకవర్గంలో రాతియుగం నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయని తెలిపారు. దాడిచేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి, హత్యాయత్నం కేసు నమోదుచేసి చట్టపరంగా శిక్షించాలని, చర్యలు తీసుకోకపోతే కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు. ఎన్నిదాడులు చేసినా, బెదిరించినా భయపడేదేలేదని, కాంగ్రెస్ హామీలు అమలుచేసేవరకూ నిలదీస్తామని చెప్పారు. నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టంచేశారు.