తెలంగాణ ఇంటి పార్టీ బీఆర్ఎస్ ఆవిర్భవించి 25వ వసంతంలోకి వెళ్తున్న సందర్భంగా వరంగల్ సమీపంలోని ఎల్కతుర్తిలో నేడు జరుగనున్న రజతోత్సవ మహాసభకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి పార్టీ శ్రేణులు, మహిళలు, ప్రజలు అధిక సంఖ్యలో తరలివెళ్లనున్నారు. రంగారెడ్డి జిల్లా నుంచి భారీగా తరలి రానుండగా.. వికారాబాద్ జిల్లా నుంచి సుమారు 30,000 మంది తరలివెళ్లేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పార్టీ తరఫున వాహనాల ఏర్పాటుతోపాటు పార్టీ అభిమానులు అత్యధికంగా తమ సొంత వాహనాల్లో స్వచ్ఛందంగా వెళ్లేందుకు సిద్ధమయ్యారు.
రంగారెడ్డి, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ)/పరిగి : వరంగల్‌లో నేడు జరుగనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభకు ఉమ్మ డి రంగారెడ్డి జిల్లా నుంచి అధిక సంఖ్యలో తరలివెళ్లనున్నారు. ఇప్పటికే అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. రంగారెడ్డి జిల్లా నుంచి భారీగా తరలి రానుండగా.. వికారాబాద్ జిల్లా నుంచి సుమారు 30,000 మంది తరలివెళ్లేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 14 ఏండ్లు రాష్ట్రం కోసం ఉద్యమించిన పార్టీ.. సాధించిన తెలంగాణను పదేండ్ల కాలంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన పార్టీగా.. గత 16 నెలలుగా ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రజలకు తామున్నామనే ధైర్యాన్ని కల్పిస్తున్న బీఆర్ఎస్ ఒక్కటే ప్రత్యామ్నాయమని అన్ని వర్గాల వారు భావిస్తున్నారు.
సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీ కార్యక్రమాలంటే హంగూఆర్భాటాలతో పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. కానీ, ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మగా ఉంటూ 25 ఏండ్లు వస్తున్న సందర్భంగా ఆదివారం నిర్వహిస్తున్న రజతోత్సవ సంబురం దశ దిశలా చాటేలా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువత, మహిళలు తరలివెళ్లనున్నారు.
వరంగల్ సమీపంలోని ఎల్కతుర్తిలో ఆదివారం జరుగనున్న భారీ బహిరంగసభకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ప్రతి గ్రామం నుంచి ఉదయం 7 గంటలకే వాహనాలు బయలుదేరేలా ఏర్పాట్లు చేశారు. పార్టీ రజతోత్సవ సభ కోసం రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్, కల్వకుర్తి తదితర నియోజకవర్గాల్లో మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అంజయ్యయాదవ్, జైపాల్‌యాదవ్ తదితరులు.. అదేవిధంగా వికారాబాద్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్, మాజీ ఎమ్మెల్యేలు కొప్పుల మహేశ్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, పైలట్ రోహిత్‌రెడ్డిల ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాలు నిర్వహించి గులాబీ దండును సన్నద్ధం చేశారు.
మండల స్థాయిలోనూ నాయకులతో సమావేశమై రజతోత్సవ సభకు వెళ్లే అంశంపై దిశానిర్దేశం చేశారు. ఆదివారం ఉదయం 6:30 గంటలకు ప్రతి గ్రామం, మున్సిపాలిటీలోని ప్రతి వార్డులోనూ పార్టీ జెండాలను ఎగురవేసి సంబురాలు జరుపుకొని వాహనాల్లో వరంగల్ సభకు బయలుదేరనున్నారు. జెండా పండుగకు దిమ్మెలను కూడా సిద్ధం చేశారు. వరంగల్ సభకు వెళ్లేందుకు పార్టీ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా నుంచి 500 బస్సులు..1500 కార్లను అందుబాటులో ఉంచాం.
అందులో ఇబ్రహీంపట్నం సెగ్మెం ట్ నుంచి 75 బస్సులు, ఎల్బీనగర్ నుంచి 20, మహేశ్వరం నుంచి 40, రాజేంద్రనగర్ నుంచి 48, చేవెళ్ల నుంచి 95, శేరిలింగంపల్లి నుంచి 30, షాద్‌నగర్ నుంచి 50 బస్సులు.. అలాగే, సుమారు 1500 కార్లలోనూ భారీగా తరలివెళ్లేందుకు సిద్ధం చేశారు. అదేవిధంగా వికారాబాద్ జిల్లాలోని వికారాబాద్, పరిగి, తాండూరు, కొడంగల్ నియోజకవర్గాలకు 215 ఆర్టీసీ బస్సులను కేటాయించారు. వాటితోపాటు సుమారు 500 ప్రైవేట్ వాహనాలనూ ఏర్పాటు చేశారు. అవేకాకుండా పార్టీ నాయకులు, అభిమానులు సుమారు 400 పైచిలుకు తమ సొంత వాహనాల్లో వరంగల్ సభకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ప్రతి కారు, ప్రతి బస్సుకూ ముందుగానే స్టిక్కర్లను అంటించారు.
జిల్లాల వారీగా కేటాయించిన పార్కింగ్‌లోనే వాహనాలను నిలపాలని డ్రైవర్లకు సూచనలు చేశారు. ప్రజలు, మహిళలు, యువత మహాసభకు వస్తామని స్వచ్ఛందంగా ముందుకొస్తున్న సందర్భంలో వాహనాలను సమకూర్చడం కష్టసాధ్యంగా మారిందని పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. మరోవైపు పార్టీ అధినేత కేసీఆర్ ప్రసంగాన్ని స్వయంగా వినేందుకు చాలామంది ఆసక్తి, ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. అదేవిధంగా బహిరంగ సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పార్టీ శ్రేణులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
ఆర్కేపురం/బడంగ్‌పేట : నేటి బీఆర్ఎస్ రజతోత్సవ సభకు మహేశ్వరం నియోజకవర్గం నుంచి ప్రజలు, పార్టీ శ్రేణులు, అభిమానులు, మహిళలు అధిక సంఖ్యలో తరలిరావాలని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఆమె సరూర్‌నగర్ డివిజన్లోని అంబేద్కర్‌నగర్‌కాలనీలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించి.. భారీ బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం హుడాకాలనీ, వీఎంహోం, పంజాలకాలనీ, రోడ్‌నం 5, భగత్‌సింగ్‌నగర్ కమ్యూనిటీ హాల్, భగత్‌సింగ్‌నగర్ మహిళా బిల్డింగ్ వద్ద, హూడా కాంప్లెక్స్‌లలో పార్టీ జెండాలను ఆవిష్కరించి మాట్లాడారు.
తెలంగాణకు మళ్లీ మంచి రోజులు రావాలంటే కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. రజతోత్సవ సభతో కాంగ్రెస్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు. వరంగల్ సభకు నియోజకవర్గం నుంచి 40 ఆర్టీసీ, 42 ప్రైవేట్ బస్సులను ఏర్పాటు చేయడం జరిగిందని.. ఇంకా వేలాది మంది తాము స్వచ్ఛందంగా వస్తామని ఫోన్లు చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అన్ని రంగాలు కుదేలు అయ్యాయని.. రాష్ట్రమంతా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఆగమవుతుంటే కేసీఆర్ చూడలేకపోతున్నారని ఆమె పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వమే ఈ రాష్ర్టానికి శ్రీరామరక్ష అని అన్నారు.
రజతోత్సవ మహాసభకు పరిగి నియోజకవర్గం నుంచి వేలాది మంది స్వచ్ఛందంగా తరలివస్తామని ముందుకొస్తున్నారు. పార్టీ ఆధ్వర్యంలో వాహనాలను ఏర్పాటు చేద్దామంటే వెహికిల్స్ లభించని పరిస్థితి ఏర్పడింది. వందలాది మంది పార్టీ అధినేత కేసీఆర్‌పై అభిమానంతో తమ సొంత వాహనాల్లో సభకు తరలివస్తామని చెబుతున్నారు. తెలంగాణ సాధించిన పార్టీ, పదేం డ్లు ప్రజలందరికీ మేలు చేసిన పార్టీ రజతోత్సవం అంటే తమ సొంత ఇంటి పండుగ వలె ప్రజలు భావిస్తున్నారు.
రజతోత్సవ సభలో తామూ భాగస్వాములమవుతామని, అధినేత కేసీఆర్ ప్రసంగాన్ని స్వయంగా వినాలన్న ఆసక్తిని చూపుతున్నారు. 16 నెలల కాంగ్రెస్ పాలనలో అనేక రకాలుగా విసుగెత్తిపోయిన జనం మళ్లీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారు. రజతోత్సవ సభను సక్సెస్ చేసి తమ సత్తా చాటాలని ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు. -కొప్పుల మహేశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, పరిగి
వరంగల్ ఎల్కతుర్తిలో నేడు జరిగే రజతోత్సవ సభ దేశ చరిత్రలోనే నిలిచిపోతుంది. రాష్ట్ర నలుమూలల నుంచి అన్ని వర్గాల ప్రజలు ఈ సభకు స్వచ్ఛందంగా తరలిరానున్నారు. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. తెలంగాణ ప్రజల ఇంటి పార్టీగా భావించే బీఆర్ఎస్ రజతోత్సవ సభను అన్ని వర్గాల వారు ఓ పండుగలా చూ స్తున్నారు.
కేసీఆర్ పాలనలో ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నా రో.. నేడు కాంగ్రెస్ పాలనలో ఎంత దుఃఖంతో ఉన్నారనే విష యం మన కండ్ల ముందే కనిపిస్తున్నది. షాద్‌నగర్ సెగ్మెంట్లోని ఆరు మండలాల నుంచి తరలిరానున్న ప్రజల కోసం ఇప్పటికే వాహనాలను అందుబాటులో ఉంచాం. చాలామంది కార్యకర్తలు, అభిమానులు స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు సిద్ధ్దమయ్యారు. -అంజయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యే షాద్‌నగర్
కల్వకుర్తి సెగ్మెంట్లో మాజీ జడ్పీటీసీ దశరథనాయక్ దంపతులు ఇంటింటికెళ్లి రజతోత్సవ బహిరంగ సభకు రావాల్సిందిగా మహిళలకు బొట్టుపెట్టి ఆహ్వానించడం అందరినీ ఆకట్టుకుంటున్నది. గత మూడు రోజులుగా ఇంటింటికెళ్లి మహిళలకు బొట్టు పెట్టి.. బహిరంగ సభ గురించి వివరించి కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాలని కోరుతున్నారు.
రజతోత్సవ మహాసభకు జిల్లా నుంచి భారీ గా తరలివెళ్లి విజయవంతం చేస్తాం. అన్ని వర్గాల వారు స్వచ్ఛందంగా సభకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. రాష్ర్టానికి పట్టిన కాంగ్రెస్ శనిని వదిలించేందు కు ప్రజలందరూ ముందుకొస్తున్నారు.
-మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ రంగాడ్డి జిల్లా అధ్యక్షుడు
నేటి బీఆర్ఎస్ బహిరంగ సభకు ప్రజలు స్వచ్ఛందం గా తరలివచ్చేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ పాలనపై ఆగ్రహంతో ఉన్నారు. అలవి కాని హామీలిచ్చి వాటిని అమలు చేయడంలో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైంది. కాంగ్రెస్ పాలనలో రైతులు, ప్రజలు ఇలా అన్ని వర్గాల వారు తీవ్ర ఇబ్బందులకు గుర వుతున్నారు. కేసీఆర్ హయాంలోనే బాగుండేనని.. ఆయన మళ్లీ సీఎం అయితేనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారు. దీంతో వరంగల్ సభకు స్వచ్ఛందంగా తరలేందుకు సిద్ధమయ్యారు.
-మెతుకు ఆనంద్, బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు
బొంరాస్‌పేట : బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలకు నియోజకవర్గంలోని గ్రామాల నుంచి ప్రజలు, మహిళలు, యువకులు స్వచ్ఛందంగా భారీగా తరలివెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ప్రతి పల్లెలోనూ జెండా దిమ్మెలకు రంగులేయడంతోపాటు గులాబీ తోరణాల అలంకరణ పనులు పూర్తయ్యాయి. ఆదివారం ఉదయం ప్రతి గ్రామంలోనూ బీఆర్ఎస్ జెండాలను నాయకులు, కార్యకర్తలు ఆవిష్కరించి.. అక్కడి నుంచి తమ వాహనాల్లో వరంగల్‌కు తరలివెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు.
– పట్నం నరేందర్‌రెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే
నేడు వరంగల్‌లో జరుగనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభకు నియోజకవర్గంలోని ప్రతి గ్రామం, తండా నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్య లో దండులా తరలివచ్చి సక్సెస్ చేయాలి.
-జైపాల్‌యాదవ్ , మాజీ ఎమ్మెల్యే కల్వకుర్తి