కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ శ్రేణులు, అన్నదాతలు భగ్గుమన్నారు. సోమవారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ర్యాలీలు, రాస్తారోకోలు, ధర్నాలతో పాటు నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. ఆరు గ్యారెంటీలంటూ ప్రజలను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తహసీల్దార్లకు వినతి పత్రాలను అందజేసి, బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నదని కాంగ్రెస్ సర్కార్ తీరును ఎండగట్టారు. 50 శాతం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేసి, పూర్తి స్థాయిలో చేశామని గొప్పలు చెప్పుకొంటున్నదన్నారు.
కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ… ఏడాది గడిచినా రైతు భరోసా ఊసెత్తలేదని.. స్థానిక సంస్థల ఎన్నికలొస్తున్నాయని రైతు భరోసా రాగమెత్తుకున్నదని విమర్శించారు. ఏడాదికి రూ.15 వేలంటూ ఒకసారి, కాదు.. కాదు.. రూ.12 వేలు అంటూ డ్రామాలాడుతున్నదని ధ్వజమెత్తారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. రైతులను నట్టేట ముంచుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. పొంతనలేని మాటలు చెబుతున్న సీఎం రేవంత్రెడ్డి, ఆ పార్టీ నాయకుల తీరును చూస్తున్న జనం నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి.. కాబట్టి రైతు భరోసా పథకాన్ని ముందలేసుకున్నారని విమర్శించారు.
ఎన్నికలు వస్తే తప్పా, కాంగ్రెస్ ప్రభుత్వానికి పథకాలు గుర్తుకొచ్చేలా లేవని ఆరోపించారు. ఏ ఒక్క పథకంపైనా స్పష్టత లేదని, పేరుకు మాత్రం ఫ్రీ బస్సు పథకాన్ని ప్రారంభించారన్నారు. ఏ పల్లెకు వెళ్లినా కరెంట్ సక్రమంగా ఉండడం లేదని, 24 గంటల ఉచిత కరెంట్ అన్న మాటలు ఉత్తుత్తివేనన్నారు. కల్యాణలక్ష్మి పథకానికి తులం బంగారం, విద్యార్థినులకు స్కూటీలు, రూ. 4 వేల పింఛన్, మహిళలకు రూ. 2500 ఆర్థిక సాయం పథకాలు ఏమైనట్టు అని ప్రశ్నించారు. వడ్లకు బోనస్ ఇస్తామన్న మాటలు బోగస్ అయ్యాయని, కూరగాయాలకు ధరలే లేవని, రైతులు గోస పడుతున్నారని వాపోయారు. కేసీఆర్ ప్రభుత్వంలో సాగు సంబురంగా సాగిందని, రేవంత్రెడ్డి పాలన వచ్చాక రైతన్న పరిస్థితి అధోగతిపాలయ్యిందని దుయ్యబట్టారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్కు తగిన గుణపాఠం తప్పదని రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు హెచ్చరించారు.
– న్యూస్ నెట్వర్క్, నమస్తే తెలంగాణ
రైతుభరోసాలో కోతలెందుకు ?
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడాదికి ఎకరాకు రూ.10వేలు ఇచ్చిందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రూ.15వేలు ఇస్తామని మాట ఇచ్చి.. ఇప్పుడు రూ.12వేలు ఇస్తామనడం సిగ్గు చేటు. రైతుల కోసం అది చేస్తాం.. ఇది చేస్తామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్.. ఇప్పుడు రైతు భరోసాలో కోతలెందుకు విధిస్తున్నట్లు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేసింది. కాంగ్రెస్ మాత్రం నట్టేట ముంచుతున్నది. పంటల కొనుగోలులోనూ దళారులు, వ్యాపారులదే హవా నడుస్తున్నది. రైతులను ఇబ్బందులకు గురిచేసిన ఏ పార్టీ మనుగడ సాధించలేదు.
– మొద్దు అంజిరెడ్డి, రాష్ట్ర ఉత్తమ రైతు (ఇబ్రహీంపట్నం రూరల్)