సిటీబ్యూరో, జనవరి 24 (నమస్తే తెలంగాణ ): ప్రజా సమస్యల పరిష్కారమే ఎజెండాగా బీఆర్ఎస్ పోరును ఉధృతం చేసేందుకు సిద్ధమైంది. ఏడాది కాలంగా గ్రేటర్లో అభివృద్ధి కుంటుపడటం, రోజురోజుకు ప్రజా సమస్యలు పెరిగిపోతుండటంతో ప్రజలతో కలిసి సర్కారుపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నిరసన గళం వైపు అడుగులు వేశారు. ఇందులో భాగంగానే గురువారం జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తిని కలిసి ప్రజా సమస్యలను పరిష్కరించాలని నియోజకవర్గాల వారీగా వినతిపత్రం సమర్పించారు.
ఈ క్రమంలోనే పోరుబాటను ఉధృతం చేసేందుకు శనివారం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో గ్రేటర్ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం నగరంలోని ఎంపీ, ఎమ్మెల్యే కాలనీలో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, మాగంటి గోపీనాథ్, మాధవరం కృష్ణారావు, ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, మర్రి రాజశేఖర్రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, కార్పొరేటర్లంతా దాదాపు 67 మంది ఈ సమావేశంలో పాల్గొంటారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై వారికి దిశానిర్దేశం చేయనున్నారు.