హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ) : గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీకి కేటాయించిన భూమిపై మాత్రమే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడాన్ని ఆ పార్టీ తప్పు పట్టింది. రాజకీయ దురుద్దేశాలతో ఈ పిటిషన్ దాఖలు చేశారని వాదించింది. మంత్రిమండలి తీర్మానాల్లో భాగంగా గత ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి కూడా భూమి కేటాయించిందని ఎత్తిచూపింది. కాంగ్రెస్ పార్టీకి స్థలం ఇవ్వడాన్ని సవా లు చేయకుండా కేవలం బీఆర్ఎస్ పార్టీకి భూమి కేటాయించడాన్ని సవాలు చేశారని తప్పుపట్టింది. దీనిపై స్పందించిన ధర్మాసనం.. ఈ వాదనపై కౌంటర్లు దాఖలు చేయాలని బీఆర్ఎస్ పార్టీని ఆదేశించింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేట సర్వే నం.239, 240లో 11 ఎకరాల భూకేటాయింపుపై మూడు వారాల్లో కౌంటరు దాఖలు చేయాలని బీఆర్ఎస్ పార్టీని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేటలో బీఆర్ఎస్ పార్టీకి 11 ఎకరాల భూమిని కేటాయించడాన్ని సవాలు చేస్తూ 2023లో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభరెడ్డి, 2024లో హైదరాబాద్‌కు చెందిన మరొకరు వేర్వేరుగా దాఖలు చేసిన ప్రజాహిత వ్యాఖ్యలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌తో కూడిన డివిజన్ బెంచ్ సోమవారం విచారించింది. రూ.3.41 కోట్లకు భూమి కేటాయించడాన్ని న్యాయవాదులు హైకోర్టు దృష్టి తెచ్చారు. తాము కౌంటర్ దాఖలు చేసినట్టు ప్రభుత్వం తెలియజేసింది. బీఆర్ఎస్ తరఫు న్యాయవాది టీవీ రమణరావు వాదనలు వినిపిస్తూ, గత ప్రభుత్వం పార్టీకి కేటాయించిన స్థలంపై ఈ వ్యాజ్యం దాఖలైందని అంటూ.. రాజకీయ దురుద్దేశాలతో పిటిషన్ దాఖలు చేశారని తెలిపారు. మంత్రి మండలి తీర్మానాల్లో భాగంగా గత ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి కూడా స్థలం కేటాయించిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీకి స్థలం ఇవ్వడాన్ని సవాలు చేయకుండా కేవలం బీఆర్ఎస్ పార్టీకి భూమి కేటాయించడాన్ని సవాలు చేశారని తప్పు పట్టారు. దీనిపై జోక్యం చేసుకున్న ధర్మాసనం.. ఈ వాదనపై కౌంటర్లు దాఖలు చేయాలని బీఆర్ఎస్ పార్టీని ఆదేశించింది.