హైదరాబాద్, మే 21(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కార్ కక్షపూరితంగా పక్కనపెట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం త్వరగా పూర్తయ్యేలా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వచ్చే నెలలో పాదయాత్ర చేపట్టనున్నట్టు మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. త్వరలో తేదీ ప్రకటిస్తామని , నార్లాపూర్ నుంచి ఉదండాపూర్ వరకు ఈ యాత్ర సాగుతుందని వెల్లడించారు. బీఆర్ఎస్ పాదయాత్ర చేస్తుందనే భయంతోనే సీఎం రేవంత్‌రెడ్డి హడావుడిగా సమీక్షలు మొదలుపెట్టారని, అందులో కనీసం ఇరిగేషన్ అధికారులే లేకపోవడం హాస్యాస్పదమని మండిపడ్డారు.
తెలంగాణభవన్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. పాలమూరు జిల్లాలో ఒక ఎకరా కూడా ఎండిపోకూడదనే ఉద్దేశంతో నాడు కేసీఆర్ ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా డిజైన్ చేశారని గుర్తుచేశారు. కేసీఆర్ హయాంలోనే ఐదు ప్రధాన రిజర్వాయర్లతో పాటు నార్లాపూర్, ఏదుల రిజర్వాయర్ల పనులు 95శాతం పూర్తయ్యాయని, కాలువల పనులు కూడా దాదాపు 98శాతం పూర్తి చేశామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో దాదాపు పూర్తయిన ప్రాజెక్టును, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టెండర్లు రద్దు చేయడంతో పడకేసిందని విమర్శించారు.
వెంటనే రీకాల్ చేసి ఆరు నెలల్లో పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. ఏపీలో చీఫ్ సెక్రటరీగా పనిచేసి, తెలంగాణ నీటి వాటాలకు గండికొట్టిన ఆదిత్యానాథ్‌దాస్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ఇరిగేషన్ సలహాదారుగా పెట్టుకోవ డంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. రేవంత్‌కు రాష్ట్రంలో సలహాదారులు ఎవరూ దొరుకలేదా? అని ప్రశ్నించారు. ఏపీ, కేంద్ర ప్రభుత్వాలు ఒకటయ్యాయని, ఢిల్లీలో బీఆర్ఎస్ ఎంపీలు లేకపోవడం వల్లే రాష్ర్టానికి తీరని అన్యాయం జరుగుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు.
జూరాల నుంచి నీళ్లెలా ఇస్తరు?
గతంలో కాంగ్రెస్, టీడీపీ పాలనలో పాలమూరును ఎండబెట్టారని, దమ్ముంటే కాంగ్రెస్ నేతలు కూడా తాము ఏం చేశామో పాదయాత్ర చేసి ప్రజలకు చూపించాలని శ్రీనివాస్‌గౌడ్ సవాల్ విసిరారు. జూరాల ప్రాజెక్టు జనవరిలోనే ఎండిపోతే, అకడినుంచి నీళ్లిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పడం ఆయన అవగాహనారాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు. శ్రీశైలం నుంచి మే నెలలో నీటిని లిఫ్ట్ చేసే వీలున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
బీఆర్ఎస్ హయాంలో మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు స్వయంగా తమను తీసుకెళ్లి ప్రాజెక్టు పనులను చూపించి ప్రశంసించారని, మరి ఇప్పుడు కాంగ్రెస్‌లో మంత్రిగా ఉండి కొల్లాపూర్ నియోజకవర్గంలో సింగోటం లింక్ కెనాల్, ఇతర లిఫ్ట్‌లను ఎందుకు పూర్తిచేయడం లేదని నిలదీశారు. మంత్రి నియోజకవర్గంలోనే రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉన్నదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతలు, మంత్రులను పాలమూరు ప్రజలు నిలదీయాలని, తెలంగాణపై బాధ్యత లేని రేవంత్ సరార్ను చరిత్ర క్షమించదని హెచ్చరించారు.
జాతీయ హోదా ఎందుకివ్వలే
రాష్ర్టాన్ని దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్ నేతలు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదని మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ప్రశ్నించారు. కాంగ్రెస్, టీడీపీ పాలనలో పాలమూరును ఎండబెట్టారని, కేసీఆర్ సీఎం అయిన తర్వాతే సాగు నీటికి ప్రాధాన్యం ఇచ్చారని, పీఆర్ఎల్ఐలోని ఐదు రిజర్వాయర్లు పూర్తి చేశారని చెప్పారు. పాలమూరు బిడ్డనని చెప్పుకొనే రేవంత్‌రెడ్డి సీఎం అయినా ప్రాజెక్టు పనులు ఎందుకు పూర్తిచేయడం లేదని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి నిలదీశారు.
కులవృత్తుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే ఊరుకోం.. కల్లు, నీరా వ్యాపారంలోకి కార్పొరేట్లను రానిచ్చేది లేదు : శ్రీనివాస్‌గౌడ్
హైదరాబాద్, మే 21(నమస్తే తెలంగాణ): కులవృత్తులను ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని చూస్తే సహించేది లేదని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కల్లు, నీరా వ్యాపారాన్ని కార్పొరేట్ కంపెనీల చేతుల్లో పెట్టేందుకు కుట్రలు చేస్తున్నదని, దీనివల్ల లక్షలాది మంది గౌడన్నల ఉపాధి దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. కల్లు, నీరా వంటి వ్యాపార హకులను కేవలం ఆయా కులవృత్తిదారులకే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
బాధితులకు న్యాయం జరిగేదాకా బీఆర్ఎస్ పోరాడుతుందని హెచ్చరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని కులవృత్తులకు ఆర్థికంగా, సామాజికంగా అండగా నిలిచామని గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గీత కార్మికుల భద్రతను పూర్తిగా గాలికొదిలేశారని, ఈ కొద్దికాలంలోనే దాదాపు 500మందికి పైగా గీత కార్మికులు తాటి, ఈత చెట్లపై నుంచి ప్రమాదవశాత్తు కింద పడి ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని, బాధితులను ఆదుకోవడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు.