మోత్కూరు, మే 21 : ఆరుగాలం చెమటోడ్చి పండించిన పంట చేతికొచ్చే వేళ.. ఆ సంతో షం ఎంతో సేపు నిలవడం లేదు. ధాన్యం విక్రయించే విషయంలో రైతులు అనేక అవస్థలు పడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధం గా రైతులే ధాన్యం రవాణాకు వాహనాలను సమకూర్చుకోవాల్సిన దుస్థితి దాపురించింది. అధికారులు పట్టించుకోక పోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిస్థితి చూస్తుంటే అన్నదాతల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. జిల్లా వ్యాప్తంగా 357 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏ ఒక్క కేంద్రంలోనూ ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరగడం లేదు.
ప్రభుత్వ నిబంధనలు కాగితాల మీదే పటిష్టం గా ఉన్నాయి. క్షేత్ర స్థాయిలో మాత్రం అమలుకు నోచుకోవడం లేదు. నెలరోజులు గడుస్తున్నా ధాన్యం ఎగుమతి చేయకపోవడంతో ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ అన్నదాతలు నరక యాతన పడుతున్నారు. వాతావరణంలోని మార్పుల కారణంగా ఎండలు మండుతున్నా కేంద్రాల వద్ద రైతులు కనీసం తలదాచుకోవడానికినీడ కూడా లేదు. తాగేందుకు గుక్కెడు మంచినీళ్లు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. అకస్మాత్తుగా వాన వస్తే ధా న్యం తడవకుండా కాపాడుకోవడానికి తగినన్ని టార్పాలిన్లు కూడా లేవు. రైతులు తమ సొంత ఖర్చులతో టార్పాలిన్లు కొనుగోలు చేయాల్సిన దుస్థితి దాపురించింది.
అలాగే గన్నీ బ్యాగుల కొరత రైతులకు శాపం గా మారింది. దీనికి తోడు తూకం వేయడంలో జరుగుతున్న జాప్యం వల్ల పొలాల్లో ఉండాల్సిన రైతులు వారాల తరబడి కొనుగోలు కేం ద్రాల వద్దే పడిగాపులు పడుతున్నారు. పంట పండించడం ఒక ఎత్తు అయితే, దానిని విక్రయించడం మరో ఎత్తు అని రైతులు వాపోతున్నారు. నెల పదిహేను రోజుల నుంచి కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించేందుకు నిరీక్షించాల్సిన దుస్థితి ఉంది. కనీసం వసతులు కూడా లేవని పగలు, రాత్రి పడిగాపులు పడుతున్నామని, తమ కష్టానికి ప్రతిఫలం ఎప్పుడు దక్కుతుందో అర్థం కావడం లేదంటున్నారు.
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించినా క్షేత్ర స్థాయిలో పరిస్థితి మారడం లేదు. కొనుగోలు కేంద్రాల పనితీరును పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయి ఉన్నతాధికారిని నియమిస్తేనే సత్ఫలితాలు వస్తాయని రైతు సంఘాల నాయకులు అభిప్రాయ పడుతున్నారు. జిల్లాలోని మోత్కూరు వ్యవసాయ మార్కెట్లో రైతులు పడుతున్న ఇబ్బందులను చూసి బీఆర్ఎస్ నాయకులు పలుమార్లు నిరసన వ్యక్తం చేసినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మోత్కూరు వ్యవసాయ మార్కెట్లో ధాన్యం పోసి నెల పదిహేను రోజులైంది. ధాన్యం విక్రయించేందుకు రోజూ నానా ఇబ్బందులు పడుతున్నా. ధాన్యం విక్రయించే విషయంలో పదేండ్లలో ఎన్నడూ ఇలాంటి రోజులను చూడలేదు. గన్నీ బస్తాలు ఇవ్వరూ.. ఇచ్చినా కాంటాలు వేయరు. కాంటాలు వేస్తే ధాన్యం రవాణా చేయడం కోసం వారం రోజులు పడుతున్నది. ఇలాంటి బాధలు ఇంకా ఎన్ని రోజులు పడాలో అర్థం కావడం లేదు. ఒక్క జిల్లా అధికారైనా వచ్చి ధాన్యం పరిశీలించి కొనుగోలు చేయాలని చెప్పిన పాపాన పోలేరు. మా లాంటి బక్క రైతుకు దిక్కెవరు.
– వర్రె యాదయ్య, రైతు మోత్కూరు