మేడ్చల్, మే21(నమస్తే తెలంగాణ): బస్తీ దవాఖానల్లో వైద్యుల పోస్టులను భర్తీ చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో 112 బస్తీ దవాఖానలు ఉండగా ఇందులో 18 బస్తీ దవాఖానల్లో వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బస్తీ దవాఖానలకు వైద్య సేవల నిమిత్తం వెళ్లే వారికి వైద్యం అందక తిరిగి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. లేదంటే వైద్యం కోసం కిలోమీటర్ల మేర దూరంగా ఉన్న బస్తీ దవాఖానలకు వెళ్లి వైద్య సేవలు పొందాల్సిన పరిస్థితి వచ్చిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని ప్రజల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బస్తీ దవాఖానల్లో వైద్యుల పోస్టులు ఖాళీ అయిన వెంటనే నిరుపేదలకు వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో వైద్యులను భర్తీ చేసేదని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సమీక్షా సమావేశంలో జిల్లా వైద్యాధికారి ఉమాగౌరి నిర్లక్ష్యంగా వ్యహరిస్తుందని జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్‌బాబు, కలెక్టర్ మను చౌదరి ఎదుట ప్రజప్రజాతినిధులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిరుపేదలకు వైద్య సేవలు అందించే ప్రభుత్వ దవాఖానల్లో అన్ని రకాల సౌకర్యాలను కల్పించేందుకు వైద్యశాఖ నిరంతరం పర్యవేక్షించేలా చూడాలని కాని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో అందుకు వైద్యశాఖ తీరు భిన్నంగా ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉప్పల్ నియోజకవర్గంలోని ప్రభుత్వ దవాఖానలో కనీస వసతులు లేవని జిల్లా వైద్యాధికారి దృష్టికి తీసుకువచ్చిన స్పందించడం లేదని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సమీక్షా సమావేశంలో లేవనెత్తిన విషయం విదితమే. కూకట్పల్లి నియోజకవర్గంలో వైద్యశాఖ తీరు బాగాలేదని కాంగ్రెస్‌కు చెందిన ప్రజాప్రతినిధులు ఆరోపణలు చేసిన విషయం విదితమే. దీంతో పాటు బస్తీ, పల్లె, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.
డబుల్ బెడ్రూంల కాలనీల వద్ద ప్రభుత్వ దవాఖానలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా 16 డబుల్ బెడ్రూంల కాలనీలు ఉండగా లక్షలాది ప్రజలు నివసిస్తున్నారు. కాలనీలు నగరానికి దూరంగా ఉన్న నేపథ్యంలో కాలనీల సమీపంలో ఏర్పాటు చేస్తే సౌకర్య వంతంగా డబుల్ బెడ్రూం కాలనీల్లో నివసించే వారికి వైద్య సేవలు అందుతాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.