హనుమకొండ, మార్చి 17 : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైకో, చిత్తశుద్ధిలేని చిల్లర మాటలు మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు వినయ్‌భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు రాజయ్య, సుదర్శన్‌రెడ్డి ధ్వజమెత్తారు. వంద ఎలుకలు తిన్న పిల్లిలాగా నిన్నటి సభలో ఏమీ తెలియనట్టు నిలబడ్డాడని, ఆయన తీరు చూస్తే స్టూడెంట్ ముందు లెక్చరర్ నిల్చున్నట్టుందని ఎద్దేవా చేశారు. సోమవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆగమేఘాల మీద, ఎవరో తరిమితే ఉరికొచ్చినట్టు ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించిన ప్రజాపాలన.. ప్రగతి బాట సభ కళావిహీనంగా, నిర్బంధాల నడుమ సాగి అట్టర్ ఫ్లాప్ అయిందని విమర్శించారు. గ్రామాలను పోలీసు బలగాలు నిర్బంధించాయని, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను హౌస్అరెస్ట్ చేశాయని ఆరోపించారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఉపఎన్నికలు వస్తాయనే భయంతోనే స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో ప్రభుత్వ సొమ్ము తో ‘ప్రజాపాలన.. ప్రగతి బాట’ పేరుతో సభ నిర్వహించారని అన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి అహంకారానికి, అవినీతికి ప్రజలు జవాబు చెప్పాలని చూస్తున్నారని తెలిపారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా స్టేషన్‌ఘన్‌పూర్‌లో గెలిచేది బీఆర్ఎస్ అభ్యర్థి రాజయ్యనేనని స్పష్టంచేశారు. కడియం శ్రీహరికి నమ్మకముంటే రాజీనామా చేసి, కాంగ్రెస్ నుంచి గెలవాలని సవాల్ విసిరారు. సమావేశంలో కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, వరంగల్ పశ్చిమ నియోజకవర్గం కో ఆర్డినేటర్ పులి రజినీకాంత్, బీఆర్ఎస్ నాయకులు జానకీరాములు, జోరిక రమేశ్, రామ్మూర్తి, వెంకన్న పాల్గొన్నారు.