నిజామాబాద్, అక్టోబర్ 12, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అధికార పక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజు ఇచ్చిన బాధ్యతను నెరవేర్చడాన్నే బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కర్తవ్యంగా పెట్టుకుంది. అందుకే ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎంత వరకు అమల్లోకి వచ్చాయో ఎప్పటికప్పుడు ప్రజల ముందుకు తీసుకువస్తూ సరికొత్త ఉద్యమాలు చేస్తోంది. జనాలకు వాస్తవాలను తెలియజేస్తూ దూసుకు పోతున్నది. అందులో భాగంగానే ప్రస్తుతం బాకీ కార్డు ఉద్యమాన్ని బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హామీలను గ్యారంటీలుగా ప్రకటించి ప్రజల్లోకి వెళ్లింది. మాయమాటలు చెప్పి అమాయక జనాలను నమ్మించింది.
గ్యారంటీ కార్డులపై పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు సంతకాలు చేసి మరీ ఇంటింటికీ పంపిణీ చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే అడగండంటూ జనాలను నమ్మించారు. కొన్ని హామీలకు సంబంధించిన పత్రాలపై సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే సంతకాలు సైతం ముద్రించారు. ఇంటింటికీ కార్డుల రూపంలో పంపిణీ చేసి జనాలను ఆకట్టుకునేందుకు లేనిపోని మాటలు సైతం చెప్పారు. కేసీఆర్ పాలనలో అవాస్తవాలు వెదజల్లి పైశాచికత్వాన్ని దక్కించుకున్నారు. అబద్ధపు ప్రచారంతో జనాలను అయోమయంలో పడేశారు. స్వల్ప మెజార్టీతో 2023, డిసెంబర్ 7న అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఇక హామీల కార్డును 22నెలలుగా మూలకు పడేయడంతో బీఆర్ఎస్ బాకీ కార్డులను తీసుకు వచ్చి ప్రజల్లోకి వెళ్తోంది.
ఆరు గ్యారంటీల పేరిట 4వందలకు పైగా హామీలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏఐసీసీ, పీసీసీ నాయకత్వం డిక్లరేషన్ల పేరుతో ఇబ్బడిముబ్బడిగా హామీలను వెదజల్లారు. ఇప్పటి వరకు ఏ డిక్లరేషన్ను కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీసీ డిక్లరేషన్ను ప్రకటించింది. అందులో పదుల సంఖ్యలో హామీలున్నాయి. కేవలం 42శాతం బీసీ రిజర్వేషన్ పేరుతో పబ్బం గడుపుతూ కాలం వెళ్లదీస్తోంది. ఇచ్చిన హామీ మేరకు చట్టబద్ధంగా, రాజ్యాంగ సూత్రాల ఆధారంగా బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు కాంగ్రెస్ సర్కారు ప్రయత్నాలు చేయడం లేదు.
అందులో భాగంగానే ఉన్నత న్యాయస్థానాల్లో కేసు విచారణ సాగుతోంది. బాకీ కార్డులను బీఆర్ఎస్ పార్టీ అద్భుతంగా రూపొందించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కులంకషంగా వివరాలను పొందుపర్చింది. ఆ హామీల సంగతేంది అంటూ బాకీ కార్డుల్లో ప్రశ్నించింది. వాటిని జనాల చేతికి అందించి చైతన్యపరుస్తోంది. రూ.2లక్షల రుణమాఫీని అరకొరగా అమలు చేయడంతో మొదలు పెడితే వృద్ధులు, ఒంటరి మహిళలు, బీడి కార్మికులు, వితంతవులు, గీత, చేనేత కార్మికులకు రూ.4వేలకు పింఛన్ పెంపును అందులో ప్రస్తావించారు.
మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సాయంపై బాకీ కార్డును రూపొందించి అందిస్తున్నారు. రైతులకు ప్రధానంగా రూ.15వేలు ఎకరాకు పెట్టుబడి సాయంపై నిలదీస్తున్నారు. 2లక్షల ఉద్యోగాల భర్తీలో నిరుద్యోగులను మోసం చేయడంపైనా బీఆర్ఎస్ ఎలుగెత్తి చాటుతోంది. మైనార్టీ డిక్లరేషన్ అమలు కాకపోవడంపైనా ముస్లీం ప్రజలకు జరుగుతోన్న అన్యాయంపైనా బాకీ కార్డు ముద్రించారు. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులతో పాటు తులం బంగారం హామీని నిలబెట్టుకోవాలంటూ బీఆర్ఎస్ బాకీ కార్డును విస్తృతంగా పంపిణీ చేస్తోంది.