మేడ్చల్, ఆగస్టు 14(నమస్తే తెలంగాణ)/ శామీర్‌పేట్ : ‘బొమ్మరాశిపేట రైతులకు అన్యాయం జరిగితే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కేసులు బనాయించినా గ్రామస్తుల నుంచి ఒక్క గుంట భూమిని పోనివ్వం’ అని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్మే చామకూర మల్లారెడ్డి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ హెచ్చరించారు. కాంగ్రెస్ వచ్చిందంటే కబ్జా.. కాంగ్రెస్ అధికారంలో ఉన్నదంటేనే దోపిడీ జరుగుతుందన్న పేరును సార్థకం చేసుకొన్నదని విమర్శించారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మండలం బొమ్మరాశిపేటలోని 1,049 ఎకరాల భూమిని 22ఏ జాబితాలోకి రెవెన్యూ అధికారులు మార్చడాన్ని నిరసిస్తూ మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట గ్రామ రైతుల మహాధర్నాలో వారు పాల్గొని ప్రభుత్వ దుర్నీతిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
మహాధర్నానుద్దేశించి చామకూర మల్లారెడ్డి మాట్లాడుతూ నమ్మి ఓటేసిన పాపానికి పగటి దొంగల లెక్క భూములను లూటీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. 22ఏలో గ్రామంలోని భూములను చేర్చడాన్ని నిరసిస్తూ గత కొన్నాళ్లుగా రైతులు నిరంతర ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. దాదాపు 70 ఏండ్లగా బొమ్మరాశిపేట రైతులు ఆ భూముల్లో వ్యవసాయం చేసుకొంటున్నారని, ఆరు దశాబ్దాల క్రితమే నాటి కాంగ్రెస్ ప్రభుత్వమే పట్టాలు ఇచ్చిందని తెలిపారు. ఎన్వోసీలు, ధరణి పాస్‌పుస్తకాలు ఉన్నప్పటికీ 1,049 ఎకరాల భూముల రికార్డులను 22 ఏలో ఎలా చేర్చారని నిలదీశారు. రైతులను కాపాడుతానని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. వచ్చీరాగానే వారిని అంధకారంలోకి నెట్టేసిందని ధ్వజమెత్తారు. బొమ్మరాశిపేట రైతులను కాపాడే బాధ్యత తమదేనని, బాధిత రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఇప్పటికే రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో దాదాపు కోటి ఎకరాల పైచిలుకు 22 ఏ జాబితాలో చేర్చారని, ఇవి రైతుల భూములని సీఎంకు తెలియదా? కలెక్టర్లకు తెలియదా? అని ప్రశ్నించారు.
‘రాష్ట్రంలోఅసలు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నదా? కలెక్టర్ ఉన్నారా?, ఆర్డీవోలు ఉన్నా లేనట్టేనా? తహసీల్దారే రికార్డులు మార్చేస్తాడా? అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమి జరుగుతున్నది’ అని మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రశ్నించారు. బొమ్మరాశిపేటలో 3, 5, 6, 10 ఎకరాలు, 14 గుంటలు ఇలా భూములున్న చిన్న, సన్నకారు రైతులపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నదని ఆరోపించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే 1,049 ఎకరాలకు పట్టాలు, పాస్ పుస్తకాలు, ఓఆర్సీలు ఇచ్చారనే విషయం మరచిపోతే ఎలాగని, బీఆర్ఎస్ పాలనలో ధరణి పాస్ పుస్తకాలకు విలువ ఇవ్వకపోతే ఎలాగని ప్రశ్నించారు. ఒక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ స్వయంగా బొమ్మరాశిపేటలో పర్యటించి ఆ భూములు రైతులవేనని, సాగు చేసుకుంటున్న రైతులకే దక్కాలని ఇచ్చిన నివేదికకూ విలువ ఇవ్వని రేవంత్ సర్కార్.. దోపిడీకి పాల్పడే అవకాశం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా సీఎం రేవంత్‌రెడ్డి స్పందించి.. బొమ్మరాశిపేట పరిధిలో 22ఏ చేర్చిన భూములపై సమగ్ర విచారణ చేపట్టి రైతాంగానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కేసీఆర్, కేటీఆర్‌తో నేతృత్వంలో బొమ్మరాశిపేట రైతుల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమవుతామని మల్లారెడ్డి హెచ్చరించారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మల్కాజిగిరి ఎంపీగా ఉన్నప్పటి నుంచి ఈ ప్రాంత భూములపై కన్నేశాడని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. ఎంపీగా ఉండగానే బొమ్మరాశిపేటలో వెయ్యి కోట్ల కుంభకోణం జరుగుతున్నదని, వెంటనే ఆ భూములకు సంబంధించిన పూర్తి నివేదిక తనకు అందజేయాలని లేఖ ద్వారా ఆనాటి కలెక్టర్‌ను కోరారని, కానీ, అప్పుటి కలెక్టర్ నివేదిక ఇచ్చారో? లేదో? తెలియదని పేర్కొన్నారు. కానీ, సీఎం అయ్యాక లగచర్ల, యాచారం, మంకాల, తుక్కుగూడ, గోపన్గూడ, కోకాపేట, శంకర్పల్లి, బొమ్మరాశిపేట, వట్టినాగులపల్లి, మోకిల వంటి ఎన్నో బంగారంలాంటి భూములను రైతుల నుంచి దౌర్జన్యంగా గుంజుకుంటున్నారని ఆరోపించారు. సీఎం అయ్యాక బొమ్మరాశిపేట రైతులపై ఆయన కన్నుపడిందని, ఆయన అనుచరులను అడ్డం పెట్టుకుని రైతాంగానికి తీరని అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
బొమ్మరాశిపేట రైతులకు అన్యాయం జరిగితే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని, ఒక గజం భూమిని కూడా పోనివ్వమని స్పష్టంచేశారు. ఈ ప్రాంతంలో వజ్రేశ్‌యాదవ్, అంజిరెడ్డి, అనిల్‌రెడ్డి, ఉదయసింహారెడ్డి, ఏవీ రెడ్డి అంతా ఎవరు? వారంతా ఎక్కడి నుంచి వచ్చారు? ఏ భూమి చూసినా, ఎక్కడికి వెళ్లినా అక్కడ వీళ్ల పేర్లే వినిపిస్తున్నాయని అనుమానం వ్యక్తంచేశారు. వీరంతా ప్రజాప్రతినిధులా? అధికారులా? రేవంత్‌రెడ్డి నిజంగా తలుచుకుంటే వారందరినీ రైతుల వద్దకు వెళ్లనీయకుండా కట్టడి చేయొచ్చు కదా అని చెప్పారు. కానీ, ఆయన చెప్పరని, ఎందుకంటే అసలు కిరికిరి అక్కడే ఉన్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్లమెంట్ ఇన్చార్జి లక్ష్మారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి జహంగీర్, మూడుచింతలపల్లి మున్సిపల్ చైర్మన్ జాము రవి, మాజీ మేయర్ కావ్య, మాజీ చైర్మన్లు రాజేశ్వర్‌రావు, పావని, మాజీ ఎంపీపీ ఎల్లూభాయిబాబు, మాజీ జడ్పీటీసీ అనితాలాలయ్య, రవి, సత్యనారాయణ, రమణ, తదితరులు పాల్గొన్నారు.