మంచిర్యాల/ చెన్నూర్, జూలై 25 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకులు కన్నెర్ర చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రం, చెన్నూర్ పట్టణంలో అంబేద్కర్ విగ్రహాల వద్ద శనివారం నిరసన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో 50 మందికైనా ఉద్యోగాలివ్వలేదని ఎంపీ వంశీకృష్ణ చేసిన వ్యాఖ్యలను వెంటనే వాపసు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో వివేక్ వెంకటస్వామి నియోజకవర్గంలో ఫ్యాక్టరీ పెట్టి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని చెప్పి ఒక్కరికీ ఉద్యోగం ఇవ్వలేక పోయారని విమర్శించారు.
ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టకుండా రాహుల్‌గాంధీకి గిఫ్ట్‌గా రాయ్‌బరేలీలో ఫ్యాక్టరీలు పెడుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి వారు కేటీఆర్‌ను ప్రశ్నించడం దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నదని ఎద్దేవాచేశారు. బీఆర్ఎస్ హయాంలో ఐటీలో 3.23 లక్షల వరకు ఉన్న ఉద్యోగాలను 9.87 లక్షలకు చేర్చిన ఘనత ఐటీ మంత్రిగా కేటీఆర్‌కే దక్కిందని గుర్తుచేశారు. బాల్క సుమన్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మందమర్రికి రూ.450 కోట్లతో ఫ్యాక్టరీ మంజూరు చేయించగా.. పక్క నియోజకవర్గానికి తరలి వెళ్లడం, నియోజకవర్గంలో సాగు, తాగు నీరు అందించేందుకు రూ.1,600 కోట్లతో మంజూరు చేయించిన చెన్నూర్ ఎత్తిపోతల పథకం ఏమైందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేటీఆర్‌పై వంశీకృష్ణ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోలేని పక్షంలో నియోజకవర్గంలో అడుగడుగునా అడ్డుకుంటామని హెచ్చరించారు. బీఆర్ఎస్, యువజన విభాగం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎంపీ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.