సిటీబ్యూరో, కంటోన్మెంట్, జూలై 25 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం క్యూర్ పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇండ్లంటూ తీసుకొచ్చిన ప్రీలాంచ్ పథకం పేద ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నది. ఏండ్ల తరబడి కూలీ పనులు చేసుకుని బతుకీడుస్తున్న నిరుపేదల సొంతింటి కలను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రియల్ ఎస్టేట్ చేస్తున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అర్హులైన నిరుపేదలకు నాణ్యమైన డబుల్ బెడ్రూం ఇండ్లను ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అన్ని వసతులు కల్పించి అందజేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నిరుపేదలు రూ.6 లక్షలు చెల్లిస్తేనే ఇందిరమ్మ ఇండ్లను ఇస్తామని ప్రకటిస్తున్నది. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇందిరమ్మ ఇండ్లను ఉచితంగా నిర్మించి ఇస్తామని ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నగరంలోని బస్తీల ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని మడ్‌ఫోర్డ్ అంబేద్కర్ హట్స్‌లో ఏండ్ల తరబడిగా గుడిసెలు వేసుకుని నివసిస్తున్న పేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామని గతేడాది జూన్‌లో హామీ ఇచ్చారు. వాళ్లు నివసించే స్థలం రక్షణ శాఖకు చెందినది కావడంతో భూబదలాయింపు చేసి అక్కడే ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామన్నారు. ఈమేరకు సర్వే నిర్వహించి 539 అర్హులైన కుటుంబాలు ఉన్నట్లు గుర్తించారు. వారందరికీ ఉచితంగా ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తామని మాటిచ్చారు. కానీ తాజాగా ప్రభుత్వం గ్రేటర్ వ్యాప్తంగా లక్ష ఇండ్లను రూ.6 లక్షల చొప్పున విక్రయిస్తామని ప్రకటించడంతో 539 కుటుంబాల సొంతింటి కలపై నీళ్లు చల్లినట్లయింది.
కూలీలు రూ.6 లక్షలు ఇవ్వగలరా?
కంటోన్మెంట్‌లోని మడ్‌ఫోర్డ్ అంబేద్కర్ హట్స్‌లో నివసించే గుడిసెల వాసులంతా అడ్డా కూలీలు, దినసరి కార్మికులు, చెత్త సేకరణ పనులు, ఆటో కార్మికులు, భవన నిర్మాణ పనులతో పాటు ఇతర చిన్నచిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరంతా సుమారు ఐదు దశాబ్దాలుగా ఇక్కడ నివసిస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అప్పటి మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే సాయన్న సహకారంతో గుడిసెవాసులకు విద్యుత్ సదుపాయం, తాగునీటి వసతి కల్పించారు. మరుగుదొడ్ల సౌకర్యం లేకపోవడంతో బయో టాయిలెట్స్ నిర్మించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా గెలుపొందిన శ్రీగణేశ్ గతేడాది గుడిసెల వద్దకు వెళ్లి అందరికీ పక్కాగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కానీ ప్రభుత్వం రూ.6 లక్షలు చెల్లించిన వారికి లాటరీ విధానంలో ఇండ్లను విక్రయిస్తామని ప్రకటించడంతో వారి ఆశలు అడియాశలయ్యాయి. ఎమ్మెల్యే శ్రీగణేశ్ ఇచ్చిన మాట ప్రకారం తమకు ఉచితంగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని కోరుతున్నారు. తమకు వచ్చే ఆదాయంతో పూట గడవడమే కష్టంగా ఉంటే రూ. 6 లక్షలు ఎక్కడి నుంచి తేల్చి చెల్లించాలని ప్రశ్నిస్తున్నారు. నిరుపేదలను నుంచి లక్షల రూపాయల వసూలు చేయడమే ప్రజా పాలనా? అని నిలదీస్తున్నారు. ప్రభుత్వ ప్రకటనపై ఎమ్మెల్యే శ్రీగణేశ్ స్పందించి 539 కుటుంబాలకు సమాధానం చెప్పాలని కోరుతున్నారు.
ఎమ్మెల్యే ఇచ్చి మాట నిలుపుకొవాలి
మా తల్లిదండ్రులు 40 ఏండ్ల కిందటి నుంచి ఇక్కడే నివసిస్తున్నారు. మా అమ్మనాన్నతో పాటు నేను కూడా దినసరి కూలీగా పనిచేస్తున్నా. గతేడాది కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ మా గుడిసెల వద్దకు వచ్చి అందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. ఇది రక్షణ శాఖ భూమి కావడంతో వాళ్లకు భూబదలాయింపు ద్వారా వేరే చోట ఇచ్చి ఇక్కడ మాకు పక్కా ఇండ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. సంబంధిత పత్రాలతో ఎమ్మార్వో ఆఫీస్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని చెప్పి వెళ్లారు. ఇప్పుడు ప్రభుత్వం రూ. 6 లక్షలు చెల్లించిన వారికే ఇండ్లు ఇస్తామని ప్రకటించింది. కూలీ పనిచేసే మా దగ్గర రూ.6 లక్షలు ఎలా ఉంటాయి? ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్యే ఉచిత ఇండ్లు నిర్మించి ఇవ్వాలి.
– వెంకటరాములు, మడ్‌ఫోర్ట్ అంబేద్కర్ హట్స్
రూ.6 లక్షలు ఎక్కడి నుంచి తేవాలి?
ఈ ప్రాంతంలో గత 40 ఏండ్లుగా గుడిసెల్లో నివసిస్తూ దినసరి కూలీగా జీవనం సాగిస్తున్నాం. ఇందిరమ్మ ఇండ్లను ఉచితంగా ఇక్కడే కట్టించి ఇస్తామని ఎమ్మెల్యే శ్రీగణేశ్ గతేడాది హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు రూ. 6 లక్షలు ఇచ్చినోళ్లకే ఇల్లు వస్తది అంటున్నారు. కూలీ పని చేసుకునే మా దగ్గర ఆరు లక్షలు ఎలా ఉంటాయి? ఇల్లు కోసం దరఖాస్తు చేసుకునేందుకే ముందుగా రూ.10 వేలు కట్టాలంటున్నారు. ఏండ్ల తరబడిగా కూలీపని చేసుకుని పిల్లలను పోషించుకుంటూ.. బతుకుతున్న మాకు ఉచితంగా ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇవ్వాలి. రూ. 6 లక్షలు మా దగ్గర ఉంటే గుడిసెల్లో ఎందుకు బతికేటోళ్లం? అవే ఆరు లక్షలతో మేమే ఇండ్లు కట్టుకునేటోళ్లం కదా? ఎమ్మెల్యే ఇచ్చిన మాట ప్రకారం మాకు ఇండ్లు కట్టించి మాట నిలుపుకోవాలని కోరుతున్నాం.
– జే జంగమ్మ, మడ్‌ఫోర్డ్ అంబేద్కర్ హట్స్