ఆదిలాబాద్ : పత్తి కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) వైఖరిని నిరసిస్తూ బుధవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన బీజేపీ ఎంపీ నగేష్ ఇంటి ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. మాజీ మంత్రి జోగు రామన్నతో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఎంపీ నగేశ్ ఇంటి ముందు బైఠాయించారు. పోలీసులు బీఆర్ఎస్ నాయకులను అక్కడి నుంచి తొలగించే ప్రయత్నం చేయడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకు దిగిన మాజీ మంత్రి తోపాటు బీఆర్ఎస్ నాయకులు పోలీసులు అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ.. సీసీఐ తేమ పేరిట పత్తి కొనుగోళ్లను నిరాకరిస్తూ రైతులకు అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. తేమతో సంబంధం లేకుండా సీసీఐ పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే వర్షాలకు కారణంగా రైతులు పత్తి పంటను నష్టపోగా సీసీఐ పరిమితులు విధించడం సరికాదని అన్నారు. ఎకరాకు 7 క్వింటాళ్ల కాకుండా 12 క్వింటాళ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న పత్తికి సుంకం తగ్గించి కేంద్ర ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని తీవ్రంగా ఖండించారు.
రైతుల సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు ఆందోళన కొనసాగిస్తామని తెలిపారు.