మంచిర్యాల, జనవరి 31(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించిన నేత కేసీఆర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలపై బీఆర్ఎస్ జంగ్ సైరన్ మోగించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో పూర్తిగా సహకరిస్తానని కేసీఆర్ వెల్లడించి, సమయం కోరినా ఇవ్వకుండా ఆదివారం విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు రెండో సారి నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నది. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తున్నదని ధ్వజమెత్తుతున్నది. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు విచారిస్తున్న ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు నిచ్చారు. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిం చేందుకు ఆ పార్టీ నాయకులు సిద్ధమయ్యారు.
బీఆర్ఎస్ ప్రశ్నించినప్పుడల్లా ఫోన్ ట్యాపింగ్ కేసులు, కాళేశ్వరంపై విచారణ, ఫార్ములా రేసుపై విచారణ అంటూ రాష్ట్ర ప్రజల దృష్టి మరల్చేలా కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ డ్రామాలు ఆడుతున్నది. సింగరేణిలో జరుగుతున్న వందల కోట్ల రూపాయల బొగ్గు కుంభకోణం వెలుగులోకి రాగానే.. ఫోన్ ట్యాపింగ్‌పై సిట్ విచారణను తెరపైకి తెచ్చింది. బొగ్గు కుంభకోణంపై రాష్ట్రం మొత్తం భగ్గుమన్న రోజుల్లో ప్రతిరోజు.. ఓ రోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఓ రోజు మాజీ మంత్రి హరీశ్‌రావు, ఓ రోజు మాజీ ఎంపీ సంతోష్‌రావును ఇలా రోజుకొకరిని సిట్ విచారణ పేరిట డైవర్షన్ పాలిటిక్స్ చేసింది.
సింగరేణి కుంభకోణం వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో పెద్దచిచ్చు పెట్టడం, దీంతో మంత్రుల మధ్య పొరపెచ్చాలు బయటపడడం తట్టుకోలేక.. ఏం లేని లొట్టపీసు కేసు ఫోన్ ట్యాపింగ్‌లో చివరకు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర సాధకులు, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విచారణకు రావాలంటూ నోటీసులు ఇవ్వడంపై యావత్ తెలంగాణ సమాజం, ప్రజలు మండిపడుతున్నారు. పాలన చేత కాక.. అడుగడుగునా పారిపాలన లోపాలు ఎత్తి చూపుతున్న బీఆర్ఎస్పై కాంగ్రెస్ కక్ష సాధింపునకు పాల్పడడాన్ని తప్పుపడుతున్నారు. కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడం అంటే తెలంగాణకు ఇచ్చినట్లేనంటూ బీఆర్ఎస్ నాయకులు, మేధావులు, ప్రముఖులు వాపోతున్నారు. కేసీఆర్‌పై కేసులు, నోటీసుల పేరిట వేధింపులు, కక్ష సాధింపులకు గురి చేయడం సరికాదంటున్నారు. కక్ష రాజకీయాలకు ముగింపు పలకాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
కేసీఆర్‌ను సిట్ విచారణ పేరిట ఉద్దేశ పూర్వకంగా వేధింపులకు గురిచేసే ప్రయత్నాన్ని నిరసిస్తూ నేడు(ఆదివారం) రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శాంతియుత నిరసనలు చేపట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో నేడు సర్కార్ దిష్టిబొమ్మలు దగ్ధం చేయడంతోపాటు మున్సిపల్, నియోజకవర్గ కేంద్రాల్లో బైక్ ర్యాలీ లు, నల్ల జెండాలతో నిరసనలు తెలుపనున్నారు. ధర్నాలు, రాస్తారోకోల ద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేయాలని మాజీ మంత్రు లు, సీనియర్ నాయకులు, పార్టీ శ్రేణులు ఆందోళనల్లో పాల్గొనాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. శాంతియుతంగా నిరసనలు తెలపాలని సూచించారు.
భైంసా, జనవరి 31 : తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి, అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలిపిన తెలంగాణ జాతిపిత కేసీఆర్‌ను అవమాన పరుస్తూ సిట్ నోటీసులు పంపడం ప్రజాస్వామ్యానికే మచ్చతేవడమేనని ముథోల్ నియోజకవర్గ బీఆర్ఎస్ సమన్వయ సమితి సభ్యులు విలాస్ గాదేవార్, లోలం శ్యాంసుందర్‌లు అన్నారు. శనివారం నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ అనే విషయాన్ని పట్టుకొని కాంగ్రెస్ పాలకులు చేస్తున్న తప్పిదాలను కప్పిపుచ్చుకొనేందుకు బీఆర్ఎస్ అగ్రనాయకులకు నోటీసులు ఇస్తూ కాలం వెల్లదీస్తున్నారని విమర్శించారు. అంతేగాకుండా అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రతిపక్ష నాయకులను వేధించడం, నోటీసులు ఇవ్వడం రాజకీయ కక్ష సాధింపు అవుతుందన్నారు.
నిర్మల్, జనవరి 31(నమస్తే తెలంగాణ) : దాదాపు 13 ఏళ్ల పాటు అలుపెరుగని పోరాటం చేసి ఈ ప్రాంత ప్రజల కలను సాకారం చేసి తెలంగాణ ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించిన ధీరుడు కేసీఆర్. తెలంగాణకు పదేళ్లపాటు సీఎంగా పనిచేసి, ప్రజలకు ఇచ్చిన హామీలతోపాటు మేనిఫెస్టోలో లేని అనేక కార్యక్రమాలు అమలు చేసి రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కింది. తెలంగాణ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న అప్పటి సీఎం కేసీఆర్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ‘సిట్’ పేరిట నోటీసులు జారీ చేసి విచారణకు పిలవడం హేయమైన చర్య. దీనిని అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నరు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లుగా రాష్ట్రంలో పాలన పూర్తిగా స్తంభించింది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోయాయి. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు ఉన్నందున ప్రజల దృష్టిని మరల్చేందుకే ఈ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెరమీదికి తెస్తున్నారు. ఇలాంటి కక్ష పూరిత చర్యలను మానుకొని అభివృద్ధిపై దృష్టి సారించాలి. అవినీతి రహితుడు, ఒక విజనరీ లీడర్, చాలా పట్టుదల మనిషి. అనుకున్నది సాధించే వరకు వదిలిపెట్టరు కేసీఆర్. అలాంటి మహోన్నతమైన వ్యక్తిని ఇబ్బందులకు గురి చేయాలని చూస్తే ప్రజలు సహించరు.
– డాక్టర్ సుభాష్‌రావు, తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ జడ్పీ కో-ఆప్షన్ సభ్యులు, నిర్మల్
ఆదిలాబాద్, జనవరి 31(నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వ రెండేండ్ల పాలన అవినీతిమయంగా మారింది. ఇటీవల జరిగిన బోగ్గు కుంభకోణం నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నది. ప్రజల గుండెల్లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడం దుర్మార్గమైన చర్య. మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి భయంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నది. ప్రజల దృష్టిని మరల్చడానికి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలను మానుకోవాలి. పది సంవత్సరాల పాలనలో కేసీఆర్ తెలంగాణను దేశంలో అగ్రస్థానంలో నిలిపిపారు. అలాంటి నాయకుడికి నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
– అనిల్ జాదవ్, ఎమ్మెల్యే, బోథ్
అసాధ్యం అనుకున్న తెలం గాణ రాష్ర్టాన్ని సుసా ధ్యం చేసి, సాధించిన తెలంగాణను భారత దేశానికి ఆదర్శంగా నిలిపిన గొప్ప నాయ కుడు కేసీఆర్‌పై సర్కార్ చిల్లర చేష్టలు రాష్ట్రం పరువు తీస్తున్నాయి. గొప్ప నాయకుడిని అవమానిస్తున్న మీ వికృత చేష్టలకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు త్వరలో వస్తాయి. కేసీఆర్ కంటే ముందు ఫోన్ ట్యాపింగ్‌లో గుంపుమేస్త్రీని విచారించాలి. కాంగ్రెస్ సర్కార్‌లో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని గగ్గోలు పెడుతుంటే దానికి సమా ధానం చెప్పడం చేతగాక గుంపు మేస్త్రీ గత ప్రభు త్వంపై పడి ఏడుస్తున్నాడు. అధికారులకు చిత్తశుద్ధి ఉంటే ముందు గుంపుమేస్త్రీపై విచారణ చేపట్టాలి. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతుంటే సమాధానం చెప్పలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఇది తెలంగాణ ప్రజలందరికీ అర్థం అవుతున్నది. ఇప్పటికైనా ఇలాంటి చిల్లర పనులు మానుకొని పాలన మీద దృష్టి పెట్టాలి.
– గోగుల రవీందర్‌రెడ్డి, తెలంగాణ ఉద్యమ కారులు, బీఆర్ఎస్ నాయకులు
సిర్పూర్(టీ), జనవరి 31 : కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వస్తున్నది. పాలన చేతగాక తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్‌పై కక్షగట్టి సిట్ ద్వారా నోటీసులు ఇప్పిస్తున్నది. రాష్ర్టాన్ని ప్రగతి పథంలో నడి పించిన కేసీఆర్‌ను నోటీసుల పేరిట వేధింపులకు గురిచేయ డం, కక్షసాధింపు చర్యలకు పాల్పడటం సరికాదు. అబద్ధపు హామీలతో అధికారంలోకీ వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి కేసీఆర్‌పై లేనిపోని కేసులు పెడుతూ ఇబ్బందులకు గురి చేయాలని చూస్తున్నడు. ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నరు. రాబోయే ఎన్నికల్లో హస్తం పార్టీకి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు.
– తోట మహేశ్, మాజీ ఉప సర్పంచ్, సిర్పూర్(టీ).
దిలావర్పూర్, జనవరి 31 : ఫోన్ ట్యాపింగ్ పేరిట కాంగ్రె స్ ప్రభుత్వం కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడం ముమ్మాటికీ రాజకీయ కక్షే. బీఆర్ఎస్ అగ్ర నాయకు లు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులకు సిట్ నోటీసులు ఇవ్వడం ముమ్మాటికీ అప్రజాస్వామికం. కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి చేస్తున్నట్లుగానే ప్రజలు భావిస్తున్నారు. కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వగాన్ని నిరసిస్తూ ఆదివారం బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు నిర్మల్ జిల్లా భైంసా 61వ జాతీయ రహదారిపై దిలావర్పూర్ బస్టాండ్‌లో నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు, నాయకులు తరలి రావాలి.
– ఏలాల చిన్నరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ దిలావార్పూర్ మండల అధ్యక్షుడు
నిర్మల్ అర్బన్, జనవరి 31 :కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చిందని బీఆర్ఎస్ సోషల్ మీడియా నిర్మల్ జిల్లా కన్వీనర్ రిజ్వాన్ ఖాన్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నేతలపై కాంగ్రెస్ పార్టీ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నదని, ప్రజలు దీనిని తిప్పి కొట్టాలని కోరారు.
– రిజ్వాన్ ఖాన్, సోషల్ మీడియా నిర్మల్ జిల్లా కన్వీనర్