మొక్కుబడిగా జీహెచ్ఎంసీ పాలకమండలి చివరి సమావేశం వాస్తవాలకు విరుద్ధంగా బడ్జెట్
-ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్
సిటీబ్యూరో, జనవరి 31 (నమస్తే తెలంగాణ ): రానున్న కొత్త ఆర్థిక సంవత్సరం (2026-27) జీహెచ్ఎంసీ రూపొందించిన మెగా బడ్జెట్‌కు ఎట్టకేలకు శనివారం నిర్వహించిన స్పెషల్ కౌన్సిల్ సమావేశం ఆమోదం తెలిపింది. 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రధాన అజెండాగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బడ్జెట్ కూర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కాస్త ఆలస్యంగా ప్రారంభమైన ఈ సమావేశంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి భావోద్వేగ ప్రసంగం చేశారు.
ఆ తర్వాత కమిషనర్ కర్ణన్ కౌన్సిల్లో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. ఆనంతరం సభ్యులు తమ అభిప్రాయాలను తెలిపారు. బడ్జెట్‌పై కాపీ పేస్ట్ బడ్జెట్ అంటూ, బడ్జెట్లో జరిపిన కేటాయింపులు పెరిగిన విస్తీర్ణానికి సరిపోవని, బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు వ్యాఖ్యానించగా, అత్యవసర సేవలైన శానిటేషన్, స్ట్రీట్ లైట్ల నిర్వహణ కోసం కేటాయింపులు మరింత పెంచాలని ఎంఐఎం సభ్యుడు సలీమ్ బేగ్ కోరారు. బీఆర్ఎస్ కార్పొరేటర్ సామల హేమ మాట్లాడుతూ ప్రస్తుతం బడ్జెట్ లో సీఆర్ఎంపీకి నిధులు కేటాయించినప్పటికీ, గత గులాబీ సరారు హయాంలో సీఆర్ఎంపీ కార్యక్రమాన్ని ఎంతో పటిష్టంగా అమలు చేస్తూ సిటీలో ఎన్నో అభివృద్ది పనులు చేపట్టిన సంగతి గుర్తు చేశారు. బడ్జెట్ లోని కేటాయింపులు, ఆదాయంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ సభ్యుడు జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ గ్రీన్ బడ్జెట్‌ను కేటాయించిన విధంగా నగరంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు వెచ్చించాలని సూచించారు. బీజేపీ సభ్యుడు శ్రవణ్, మజ్లీస్ ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ లు బడ్జెట్లోని కేటాయింపులు, విలీన పట్టణ స్థానిక సంస్థల ఆదాయం, అప్పులపై క్లారిఫికేషన్ కోరగా, వారికి క్లారిఫికేషన్ ఇవ్వకుండానే మధ్యాహ్నం రెండున్నర గంటలకు బడ్జెట్‌ను కౌన్సిల్ ఆమోదిస్తూనే మేయర్ కౌన్సిల్‌ను ముగించారు. ఒక వైపు విలీనం, పునర్విభజన ప్రక్రియలకు సమాంతరంగా అహర్నిశలు శ్రమించి బడ్జెట్ ను రూపకల్పన చేసినట్లు కమిషనర్ కౌన్సిల్ లో వివరించారు. భవన నిర్మాణ అనుమతులు, ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్, ట్రేడ్ లైసెన్స్ ఛార్జీలతో పాటు ప్రధాన ఆర్థిక వనరుల నుంచి ఆదాయం సమకూరుతున్నందున ఈ సారి రెవెన్యూ ఆదాయాన్ని రూ. 6441 కోట్లుగా పొందుపరిచారు.
స్పెషల్ కౌన్సిల్ ఆమోదం
గత ఆర్థిక సంవత్సరం ప్రాపర్టీ ట్యాక్స్ రూ. 2038 కోట్ల వసూలు కాగా, రానున్న ఆర్థిక సంవత్సరంలో ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ ఆదాయాన్ని తకువగా కేటాయించటంపై సభ్యులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీనికి తగినట్టుగానే రెవెన్యూ వ్యయాన్ని కూడా రూ. 4 వేల 57 కోట్లుగా పేరొన్నారు. మొత్తం బడ్జెట్ పరిమాణం రూ. 11,460 కోట్లు కాగా, వర్తమాన ఆర్థిక సంవత్సరం (2026-27) బడ్జెట్ రూ.10714.73 కోట్ల బడ్జెట్ తో పోల్చితే వచ్చే వార్షిక బడ్జెట్ ను రూ. 745.27 కోట్లు పెంచి రూపకల్పన చేసిన బడ్జెట్ ను శనివారం స్పెషల్ కౌన్సిల్ ఆమోదించింది. ఈ క్రమంలోనే త్వరలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేయనున్నారు. సమావేశం సందర్భంగా చంపాపేట డివిజన్ కార్పొరేటర్ వంగా మధుసూదన్ రెడ్డి అకాల మరణం పట్ల కౌన్సిల్ దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. మేయర్, కౌన్సిల్ సభ్యులు వారికి నివాళులర్పించారు.
అనేక సవాళ్లను ఎదుర్కొన్నాం : కమిషనర్ కర్ణన్
గత బడ్జెట్‌తో పోల్చుకుంటే 2026-27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ తయారీలో అనేక సవాళ్లు ఎదురయ్యాయని కమిషనర్ కర్ణన్ తెలిపారు. 27 పురపాలికలు జీహెచ్ఎంసీలో విలీనం తర్వాత వాటి లయబిలిటీ, అస్సెట్‌ను లెక్కించామని చెప్పారు. ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్మెంట్, కలెక్షన్‌ను ఎండ్ టు ఎండ్ పూర్తిగా ఆన్లైన్ చేశామని కమిషనర్ వివరించారు. కొత్తగా విలీన పురపాలికల్లో కూడా ఆన్లైన్ ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పారు. ప్రజా అవసరాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఇలా అన్నిఅంశాలను పరిగణనలోకి తీసుకుని బడ్జెట్‌ను రూపొందించామని తెలిపారు.