BRS | బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన పదిమంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. మాజీమంత్రి, ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీష్ రెడ్డి, అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ విప్ కేపీ వివేకానంద, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తదితరులు స్పీకర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. స్పీకర్‌ను కలిసిన అనంతరం వారు అసెంబ్లీ మీడియా పాయింట్లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో మాట్లాడారు.
మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. ‘మేం సుప్రీంకోర్టుకు వెళ్ళడంతో ఎమ్మెల్యేల అనర్హతపై మూడు నెలల్లో నిర్ణయం చేయాలని కోర్టు తీర్పు ఇచ్చింది. స్పీకర్ పదిమంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. దాంతో కొంతమంది ఎమ్మెల్యేలు ‘మేం అమాయకులం, కేసీఆర్‌పైన నమ్మకం ఉంది’ అని స్పీకర్‌కు వివరణ ఇచ్చారు. దాంతో స్పీకర్ పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాధానాన్ని మాకు పంపిస్తూ మూడు రోజుల్లో మమ్మల్ని సమాధానం ఇవ్వాలని కోరారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఎక్కువ రోజులు సమయం ఇచ్చిన స్పీకర్ మాకు మాత్రం మూడు రోజులే సమయం ఇచ్చారు. స్పీకర్ గడువు ఇచ్చిన మూడు రోజుల్లోనే మేం సమాధానం ఇచ్చాం’ అని అన్నారు.
‘మేం పార్టీ మారలేదని, సీఎం దగ్గరకు వెళ్తే మా మెడలో మూడు రంగుల కండువా కప్పారని పార్టీ మారిన ఎమ్మెల్యేలు అమాయకంగా చెప్పారు. వారు అమాయాకత్వాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ సభలు, సమావేశాల్లో పదిమంది ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. స్థానికసంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేద్దాం అని పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పోచారం మాటలను ఏఐ ద్వారా ఏమైనా మార్ఫింగ్ చేశారా..? నా నియోజకవర్గంలో సమస్యలు ఉన్నాయంటే సీఎం మా ఇంటికి వచ్చారని పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డికి కేసీఆర్‌పై నమ్మకం ఉంటే కేసీఆర్ ఫోటో, కేసీఆర్ కండువా ఉండాలి కదా..? అభివృద్ధి కోసం సీఎంను కలిసిన పోచారం శ్రీనివాస్ రెడ్డి రాహుల్ గాంధీ, మహేష్ కుమార్ గౌడ్‌ను ఎందుకు కలిశారు..?’ అని ప్రశ్నించారు.
‘జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ‘నేను నియోజకవర్గ అభివృద్ధి కోసం వెళ్తే సడెన్‌గా సీఎం కండువా కప్పారు’ అని
చెప్పారు. మరి సంజయ్ పేపర్ ప్రకటనల్లో కాంగ్రెస్ నేతలు ఎందుకు ఉన్నారు..? గాంధీ భవన్, కాంగ్రెస్
పార్టీ మీటింగ్స్ లో పాల్గొంటే అభివృద్ధి ఎట్లా అవుతుంది..? వ్యక్తిగత ప్రయోజనాల కోసం పదిమంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. మేము తప్పుచేసి పార్టీ మారామని నియోజకవర్గ ప్రజల ముందు ఒప్పుకోవాలి. మేం పార్టీ మారలేదని కేసీఆర్ దగ్గర పిటిషన్ పెట్టుకోండి. నోటీసులు వచ్చాక కేసీఆర్ దగ్గరకు రావాల్సిన పదిమంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి దగ్గరకు ఎందుకు వెళ్లారు..? ఎన్ని చేసినా పదిమంది ఎమ్మెల్యేలు తప్పించుకోలేరు. వాళ్లు దొరికిపోయిన దొంగలు. సీఎం రేవంత్ రెడ్డి మూటలతో దొరికి తప్పించుకున్నారు. మేం తప్పించుకోలేమా అని ఎమ్మెల్యేలు అనుకుంటున్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టం తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ. పదిమంది ఎమ్మెల్యేలు ఇక్కడ తప్పించుకున్నా కోర్టు ముందు తప్పించుకోలేరు’ అని అన్నారు.
‘ఉప ఎన్నికలు రావడం ఖాయం. మీకు రాజకీయ భవిష్యత్ లేకుండా ప్రజలు చేయడం ఖాయం. కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ విదేశాల్లో ఉండటంతో వచ్చిన తర్వాత స్పీకర్‌కు ఆధారాలు సమర్పిస్తారు. కోర్టు ఇచ్చిన గడువులోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. కోర్టు గడువు ఉన్నందున ఎక్కువ రోజులు సమయం లేదని, మూడు రోజుల్లో చెప్పాలని స్పీకర్ మమ్మల్ని కోరారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఫోటోలను మీడియా మార్ఫింగ్ చేసిందా…? బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పార్టీ మారారు అని మీడియాలో వచ్చింది కదా..? ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సికింద్రాబాద్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినా ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదు. పదిమంది ఎమ్మెల్యేలపై చర్యలు త్వరగా తీసుకోవాలని మేం కోరుతున్నాం’ అని జగదీష్‌రెడ్డి అన్నారు.