Srinivas Goud | ఉమ్మడి ఏపీలో అత్యంత నష్టపోయిన జిల్లా పాలమూరు జిల్లా అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పాలమూరు జిల్లాను మంత్రులు ఎవరూ పట్టించుకోలేదని తెలిపారు. ఆస్తులు కూడబెట్టుకున్నారు తప్ప రైతులను ఆదుకోలేదని విమర్శించారు. పాలమూరులో పడావు పడ్డ ప్రాజెక్టులపై గులాబీ పార్టీ సమరభేరీ మోగించింది. ఈ క్రమంలో జూరాల ప్రాజెక్టును మాజీ మంత్రులు నింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్లతో కూడిన బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం సందర్శించింది. నార్లపూర్ పంప్‌హౌజ్, రిజర్వాయర్, వట్టెం పంప్‌హౌజ్, కరివెన రిజర్వాయర్లను సందర్శించారు. ప్రాజెక్టులను పడావు పెట్టిన ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ఉమ్మడి ఏపీలో రెండు ట్రిబ్యునల్లు ఏర్పాటైనా పాలమూరును పట్టించుకోలేదని అన్నారు. జూరాల ప్రాజెక్టు మొత్తం ఎండిపోతుందని శ్రీనివాస్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. యాసంగి పంటలకు జూరాల ఆయకట్టుకు క్రాప్ హాలీడే ఇచ్చారని తెలిపారు. ఈ జూరాల నుంచి 70 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తారా అని ప్రశ్నించారు. ఇదేం ప్రభుత్వం? అసలు నీళ్ల మీద సోయి ఉందా అని నిలదీశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 90 శాతం పూర్తి చేసుకున్నామని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. తట్టెడు మన్ను తీయకుండా బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తారా అని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. పాలమూరు మళ్లీ దివాలా తీసేలా కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. పాలమూరును సస్యశ్యామలం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు. రాజకీయ కోణంలో చూడకుండా పాలమూరు బాగు చేయాలని సూచించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ 45 టీఎంసీలకు ఒప్పుకోమని తెలిపారు. మా పాలమూరు జిల్లాకు కేటాయించిన నీళ్లు మాకు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అప్పుడు మీరిచ్చిన నీళ్ల కంటే డబుల్ నీళ్లను కేటాయించుకుంటామని తెలిపారు.