కూసుమంచి(నేలకొండపల్లి), మార్చి 15 : అణగారిన కులాల అభ్యున్నతే లక్ష్యంగా స్వేరోస్ పని చేస్తుందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, మాజీ ఐపీఎస్ అధికారి, స్పేరో వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. నేలకొండపల్లి మండల కేంద్రంలోని బౌద్ధ స్తూపం వద్ద స్వేరో ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలకు శనివారం ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ స్వేరోయిజం అనేది కాంతి వేగంతో సాగాలని, ఇది నెల రోజులకే పరిమితం కాకుండా నిరంతరం స్వేరోయిజం జరుగుతూ ఉండాలన్నారు.
2013లో భీమ్ దీక్ష ప్రారంభమైందని, కాన్షీరాం జయంతి రోజు మొదలై అంబేడ్కర్ జయంతి రోజున దీక్షలు ముగుస్తాయన్నారు. ప్రతీ ఇంట్లో పుస్తకాలు ఉండాలని, ప్రతీ రోజు పుస్తక పఠనం చేయాలని, తద్వారా పిల్లలకు జ్ఞానం అందుతుందన్నారు. ప్రపంచంలోని గొప్ప వ్యక్తులందరూ పుస్తక పఠనంతోనే వెలుగులోకి వచ్చారని ఆయన గుర్తు చేశారు. దళిత కుటుంబాల్లో నేటికి వెనుకబాటుతనం కనిపిస్తుందని, వారంతా కుంగిపోకుండా అన్ని రంగాల్లో రాణించినప్పుడే మంచి గుర్తింపు లభిస్తుందన్నారు.
భీం ఒక్క తెలంగాణ రాష్ట్రం లోనే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో స్వేరోలు గ్రామాల్లో తిరుగుతూ అజ్ఞానం అనే సంకెళ్లను తెంచి వేశారని గుర్తు చేశారు. గంజాయి, మాదక ద్రవ్యాలు, మద్యపానం, ధూమపానం వంటి వాటికి దూరంగా ఉంటే అనేక సమస్యలు తీరడంతోపాటు ఆరోగ్యం బాగుంటుందన్నారు. రాష్ట్ర స్పేరో అధ్యక్షుడు చిలకబత్తిని వీరయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు దేవరగట్టు బాలప్రసాద్, జిల్లా అధ్యక్షుడు మొండితోక ఈదయ్య, ఉపాధ్యక్షుడు శ్రీకాంత్, కిషన్, పుల్లయ్య, లలిత, శోభ, ప్రకాశ్, నియోజకర్గ మండల బాధ్యులు పాల్గొన్నారు.