Rega Kanta Rao | పినపాక మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత రేగా కాంతారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపేందుకు కుట్రలు చేస్తున్నారని తెలిపారు. అభివృద్ధిపై ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుపై ఆదివారం నాడు కాంగ్రెస్ నాయకులు దాడి చేసి, ఫర్నీచర్‌ను తగులబెట్టిన ఘటనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
మణుగూరులో కాంగ్రెస్ పార్టీ ఆఫీసును కబ్జా చేసి బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుగా మార్చారని చేస్తున్న ఆరోపణలను రేగా కాంతారావు ఖండించారు. పార్టీ ఆఫీసు డాక్యుమెంట్లు తన దగ్గరే ఉన్నాయని తెలిపారు. పట్టాదారుల దగ్గర నుంచి ఆ స్థలాన్ని కొనుగోలు చేశామని ఆయన స్పష్టం చేశారు. అయినప్పటికీ తమ ఆఫీసును బలవంతంగా లాక్కున్నారని మండిపడ్డారు. డీఎంఎఫ్టీ నిధులపై ప్రశ్నించినందుకే తమపై దాడులు చేశారని ఆరోపించారు. డీఎంఎఫ్టీ నిధులపై వెనక్కి తగ్గమని స్పష్టం చేశారు.
మణుగూరులో ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్ నియోజకవర్గ కార్యాలయం తమదంటూ కొన్ని రోజులుగా కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారు. పత్రాలు చూపించి నిరూపించుకోవాలంటూ బీఆర్ఎస్ నాయకులు సోషల్‌మీడియా ద్వారా సమాధానమిస్తున్నారు. ఈ క్రమంలో సమయం కోసం వేచి చూసిన కాంగ్రెస్ గూండాలు ఆదివారం పక్కా స్కెచ్‌తో రంగంలోకి దిగారు. బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే అయిన రేగా కాంతారావు, పార్టీ నాయకులు కొద్దికాలంగా జూబ్లీహిల్స్‌లో ఉప ఎన్నికల ప్రచారంలో ఉంటున్నారు. దీనిని అదునుగా భావించిన కాంగ్రెస్ రౌడీమూకలు ఆదివారం ఉదయం పది గంటలకు మణుగూరులోని బీఆర్ఎస్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు.
షట్టర్లు పగులగొట్టి లోనికి వెళ్లి విధ్వంసం సృష్టించారు. స్థానికంగా ఉండే నలుగురు బీఆర్ఎస్ కార్యకర్తలు హుటాహుటినా అక్కడికి చేరుకొని అడ్డుకోబోయారు. దీంతో ఆ బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ గూండాలు విచక్షణారహితంగా పిడిగుద్దులు గుద్దారు. తీవ్రంగా గాయపడిన వారిని బయటకు గెంటివేశారు. కాంగ్రెస్ గూండాగిరి ప్రదర్శించి బీఆర్ఎస్ కార్యాలయాన్ని ఆక్రమించడం, ఫర్నిచర్‌కు నిప్పుపెట్టడంతో పట్టణ ప్రజలు, స్థానికులు పెద్దసంఖ్చలో అక్కడికి చేరుకున్నారు. వందల సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి విధ్వంసం సృష్టిస్తుండడంతో మణుగూరు సబ్ డివిజన్ పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. 144వ సెక్షన్ విధించారు. మధ్యాహ్నం తరువాత పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.