Telangana | రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పడిపోవడంతో తన ప్లాట్‌ను అమ్ముకోవడానికి ఓ వ్యక్తి పెట్టిన లక్కీ డ్రాలో 10 నెలల చిన్నారిని అదృష్టం వరించింది. కేవలం రూ.500 పెట్టి లక్కీ డ్రాలో పాల్గొంటే 16 లక్షల రూపాయల విలువైన ప్లాట్ ఆ చిన్నారి సొంతమైంది. దీంతో తన కూతురు లక్ష్మీదేవిలా తనకు అదృష్టం తెచ్చిపెట్టిందని తండ్రి మురిసిపోతున్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. నల్గొండ జిల్లా కేంద్రానికి చెందిన కార్పెంటర్ రామబ్రహ్మం.. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో 66 గజాల విస్తీర్ణంలో ఉన్న తన రేకుల ఇంటిని అమ్మకానికి పెట్టాడు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ పడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఏడాది నుంచి ప్రయత్నిస్తున్నప్పటికీ తన ప్లాట్ అమ్ముడుపోకపోవడంతో వినూత్న ఆలోచన చేశాడు. లక్కీ డ్రాలో తన ఇంటిని అమ్మేందుకు నిర్ణయించుకుని, డ్రా పద్ధతిలో రూ.500లకే గెలుచుకోవచ్చంటూ విస్తృతంగా ప్రచారం చేశాడు.ఇందుకోసం 3600 కూపన్లు ముద్రించానని ప్రకటించాడు. దీనికి సంబంధించి జాతీయ రహదారిపై ఒక ప్లెక్సీని కూడా ఏర్పాటు చేశాడు. వీటికి నవంబర్ 2వ తేదీన లక్కీ డ్రా తీస్తానని చెప్పాడు.
మరోవైపు రంగారెడ్డి జల్లా శంకర్‌పల్లిలోని ఓ హోటల్లో పనిచేసే శంకర్ సొంతింటి కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇదే సమయంలో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో లక్కీ డ్రా తీస్తున్నారని తెలుసుకున్నాడు. దీంతో తన పేరుతో పాటు భార్య ప్రశాంతి, ఇద్దరు పిల్లలు సాయి రిషిక, హన్సిక పేర్ల మీద నాలుగు కూపన్లను శంకర్ కొనుగోలు చేశాడు. ఆదివారం నాడు లక్కీ డ్రా తీయగా.. పది నెలల చిన్నారి హన్సిక పేరు మీద కూపన్ వచ్చింది. ఈ విషయాన్ని చిన్నారి తండ్రి శంకర్‌కు రామబ్రహ్మం ఫోన్ చేసి సమాచారం అందించాడు. తొందరలోనే తన ఇంటిని రిజిస్ట్రేషన్ చేయిస్తానని తెలిపాడు. దీంతో శంకర్ ఆనందం వ్యక్తం చేశాడు. తన కూతుళ్లే తన ఇంటి మహాలక్ష్మీ అని చెప్పారు. వారితోనే అదృష్టమని చెప్పుకొచ్చాడు.