Manne Krishank | హైదరాబాద్, అక్టోబర్ 6: బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై తాజాగా నమోదైన కేసులో భాగంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
కాంగ్రెస్ నేత మెట్టు సాయికుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అక్టోబర్ 5న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్‌స్టేషన్‌లో క్రిశాంక్‌పై కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్లో మన్నె క్రిశాంక్, ‘ఎంఆర్ మీడియా తెలంగాణ’తోపాటు మరికొందరిని నిందితులుగా పేర్కొన్నారు. BNSలోని 353(2), 352 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం.
రేవంత్‌రెడ్డి కుటుంబానికి సంబంధించిన అవినీతి, వ్యాపార లావాదేవీలపై క్రిశాంక్ చేసిన ఆరోపణలు, వ్యాఖ్యల నేపథ్యంలోనే ఈ కేసు నమోదైందని బీఆర్ఎస్ ఆరోపించింది. ముఖ్యమంత్రి కుటుంబానికి చెందినట్లు క్రిశాంక్ పేర్కొంటున్న రూ.50 వేల కోట్ల బినామీ పెట్టుబడులపై ప్రశ్నించినందుకే ఆయనను ప్రభుత్వం టార్గెట్ చేసిందని పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. క్రిశాంక్‌పై వరుసగా కేసులు నమోదు చేస్తూ ప్రతిపక్ష గొంతును అణచివేసేందుకు ప్రభుత్వం పోలీసు వ్యవస్థను ఉపయోగిస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.
క్రిశాంక్‌పై నమోదైన కేసుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. రేవంత్‌రెడ్డిపై అవినీతి ఆరోపణలను ప్రశ్నించినందుకే క్రిశాంక్‌పై కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. “రాహుల్‌గాంధీ జీకి అంతులేని ఏటీఎంగా ఉన్న రేవంత్‌రెడ్డి అవినీతిని ప్రశ్నిస్తే.. 420 హామీల ఫేకూ గాంధీ కేసులు పెట్టిస్తారు” అంటూ కేటీఆర్ విమర్శించారు. ఎన్ని కేసులు పెట్టినా తమ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు. “మిస్టర్ ఫేకూ గాంధీ.. మీకు నచ్చినన్ని కేసులు పెట్టుకోండి. బీఆర్ఎస్ కాంగ్రెస్ అవినీతిని బయటపెడుతూనే ఉంటుంది. ఇది మీకు నా హామీ. ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయి” అని కేటీఆర్ పేర్కొన్నారు.