హైదరాబాద్ : సినిమా రంగం విషయంలో రేవంత్‌రెడ్డి సర్కారు అనుసరిస్తున్న వైఖరిపై బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శలు గుప్పించారు. ‘సినిమా రంగాన్ని ఒక పరిశ్రమగా చూస్తున్నారా? లేక మీ రాజకీయ కక్షలు తీర్చుకునే అడ్డాగా మార్చుకున్నారా?’ అని ప్రశ్నించారు. ఒక సినిమాకేమో అర్ధరాత్రి దాకా పర్మిషన్ ఇవ్వరని, ఇంకో సినిమాకేమో రెండు రోజుల ముందే రాచ మర్యాదలతో పర్మిషన్ ఇస్తారని మండిపడ్డారు.
‘వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే’ అన్నందుకు ఒక హీరో సినిమాపై కక్ష గడతారని, సీఎం పేరు మర్చిపోయినందుకు ఇంకో హీరోని జైలుకు పంపిస్తారని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. మీకు నచ్చినోళ్లు అయితే టికెట్ ధర రూ.600కు పెంచుకునేందుకు పర్మిషన్ ఇస్తారా..? అని ప్రశ్నించారు. ‘మొన్న ఎన్నికల్లో ఓడిపోయి.. నేడు రాజ్యాంగేతర శక్తిగా ఎదిగి.. సినిమా టికెట్ల రేట్లను శాసిస్తున్న ఆ కనిపించని శక్తి ఎవరో..? ఒక్కో సినిమాకు కమిషన్ల రూపంలో ఎన్ని కోట్లు వసూలు చేస్తున్నారో..? ఆ వివరాలన్నీ త్వరలోనే బయటపెడతాం’ అని హెచ్చరించారు.
సినిమాటోగ్రఫీ శాఖ మంత్రికి తెలియకుండా జరుగుతున్న ఈ సినిమా రేట్ల కమిషన్ల దందాపై గవర్నర్ దృష్టి సారించాలని హరీశ్‌రావు కోరారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామని అన్నారు.