Peanuts | మన ఆరోగ్యానికి పల్లీలు ఎంతో మేలు చేస్తాయి. వీటితో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. చట్నీ, పచ్చడి వంటి వాటితో పాటు వివిధ వంటకాల్లో వాడుతూ ఉంటాం. ముఖ్యంగా పల్లీలతో చేసే స్నాక్స్ చాలా రుచిగా ఉంటాయి. ఆరోగ్యానికి మేలు చేసేవి కనుక వీటితో చేసిన స్నాక్స్ ను తీసుకోవడానికి చాలా మంది ఇష్టపడతారు. పల్లీల్లో మన శరీరానికి అవసరమయ్యే అనేక పోషకాలు ఉంటాయి. వీటిలో ప్రోటీన్ తో పాటు నియాసిన్, ఫోలేట్, విటమిన్ ఇ వంటి పోషకాలు ఉంటాయి. పల్లీల్లో రెస్వెరాట్రాల్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. అయితే పల్లీలు మన ఆరోగ్యానికి మేలు చేసేవే అయినప్పటికీ పల్లీలతో చేసిన స్నాక్స్ ను తీసుకోవచ్చా.. లేదా అనే సందేహం మనలో చాలా మందికి ఉంటుంది. అసలు పల్లీలతో చేసిన స్నాక్స్ ను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి మేలు కలుగుతుందా.. లేదా హాని కలుగుతుందా.. అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పల్లీలు మొక్క ఆధారిత ప్రోటీన్. అలాగే వీటిలో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. వీటిని స్నాక్స్ గా తీసుకోవడం వల్ల శరీరానికి శక్తి అందుతుంది. అలాగే కడుపు నిండిన భావన కూడా కలుగుతుంది. దీంతో క్యాలరీలు తీసుకోవడం తగ్గుతుంది. కనుక శరీర బరువు కూడా అదుపులో ఉంటుంది. పల్లీలల్లో మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచడంలో సహాయపడతాయి. వీటిలో అర్జినిన్ అనే అమైనో ఆమ్లం కూడా ఉంటుంది. ఇది రక్తప్రవాహాన్ని పెంచడంలో, గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో దోహదపడుతుంది. పల్లీల్లో ఉండే నియాసిన్, ఫోలేట్ మెదడు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి. వీటిని తీసుకోవడం వల్ల నరాల సంబంధిత సమస్యలు తగ్గడంతో పాటు అల్జీమర్స్ వంటి వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి.
పల్లీలు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ను కలిగి ఉంటాయి. కనుక వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. పల్లీల్లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. ఇవి కణాల ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి మనల్ని దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడకుండా కాపాడడంలో సహాయపడతాయి. పల్లీలను ఉడికించి తీసుకున్నప్పుడే ఈ ప్రయోజనాలన్నీ మనకు అందుతాయని వైద్యులు చెబుతున్నారు. ఇక పల్లీలను నూనెలో వేయించి స్నాక్స్ గా తీసుకోవడం వల్ల మన శరీరానికి నష్టం కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు. ఒక గుప్పెడు పల్లీలల్లో దాదాపు 160 నుండి 200 క్యాలరీలు ఉంటాయి. వీటిని నూనెలో వేయించి ఉప్పు, మసాలాలు చల్లి తీసుకోవడం వల్ల క్యాలరీలు మరింతగా పెరుగుతాయి. కనుక బరువు తగ్గాలనుకునే వారు వేయించిన పల్లీలకు బదులుగా ఉడికించిన పల్లీలు తీసుకోవడం మంచిది.
అలాగే పల్లీలు కొందరిలో అలర్జీలకు కూడా కారణమవుతాయి. కొన్నిసార్లు ఇవి ప్రాణాంతకం కూడా కావచ్చు. కనుక పల్లీల అలర్జీ ఉన్నవారు వీటిని స్నాక్స్ గా తీసుకోకపోవడమే మంచిది. పల్లీలు అప్లాటాక్సిన్ల ద్వారా కలుషితం అయ్యే అవకాశం ఉంది. వీటిని సరిగ్గా నిల్వచేయకపోవడం వల్ల వీటిపై బూజు పెరిగి విషపూరితం అవుతాయి. ఇవి కాలేయ క్యాన్సర్ కు కూడా దారి తీస్తాయి. పల్లీల్లో ఒమెగా 6 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో ఒమెగా 3 కొవ్వు ఆమ్లాల మధ్య, ఒమెగా 6 కొవ్వు ఆమ్లాల మధ్య అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది క్రమంగా ఆర్థరైటిస్, గుండె జబ్బులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. కనుక వీటిని స్నాక్స్ గా తీసుకున్నప్పటికీ తక్కువ పరిమాణంలో తీసుకోవడం మంచిది. అదే విధంగా పల్లీల్లో ఫైటిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ఒక యాంటీ న్యూట్రియంట్. వీటిని తీసుకోవడం వల్ల శరీరం క్యాల్షియం, జింక్ వంటి ఖనిజాలను ఎక్కువగా గ్రహించదు. దీంతో శరీరంలో ఆయా పోషకాల లోపం ఏర్పడుతుంది. పల్లీలను ఎక్కువగా తీసుకునే వారిలో ఈ లోపాన్ని గమనించవచ్చు.
పల్లీలు మన ఆరోగ్యానికి మేలు చేసేవే అయినప్పటికీ వీటిని మితంగా తీసుకోవడమే మంచిది. అలాగే వీటిని తీసుకునే పరిమాణం, పద్దతి రెండు కూడా మన శరీరంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. కనుక పల్లీలను ఉడికించి తీసుకోవడం మంచిది. అలాగే తక్కువ పరిమాణంలో తీసుకోవడం వల్ల వాటి వల్ల కలిగే ప్రయోజనాలు మన శరీరానికి అందుతాయి.