Harish Rao | సిద్దిపేటలో అభివృద్ధిని సీఎం రేవంత్‌రెడ్డి అడ్డుకుంటున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ దృష్టికి తీసుకుపోయి తాను మంజూరు చేయించిన వెటర్నరీ కాలేజీని కొండంగల్కి తరలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు జరుగుతున్న దానిని ఎట్లా తరలించుకెళ్తారని ప్రశ్నించారు. అక్కడ అభివృద్ధి జరగాలి అని కోరుకుంటాం. కానీ , ఇక్కడ జరుగుతున్న పనులను ఆపి ఆర్ధాంతరంగా ఎలా తరలిస్తారని నిలదీశారు. మెదక్ పార్లమెంట్ పరిధిలోని సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గ కేంద్రాల్లో శుక్రవారం నిర్వహించిన పార్టీ సన్నాహక సమావేశాల్లో హరీశ్‌రావు పాల్గొని ప్రసంగించారు. సిద్దిపేటలో శిల్పారామం, అల్లీపూర్ డబుల్ రోడ్డు పనులను మధ్యలోనే అడ్డుకొని నిధులను కొడంగల్‌కు తరలిస్తున్నారని మండిపడ్డారు.
కొడంగల్ నియోజకవర్గానికి నీవు ఏమైనా తీసుకెళ్లు కానీ సిద్దిపేటకు వచ్చినవి తీసుకెళ్తే చూస్తూ ఊరుకోమని సీఎం రేవంత్ రెడ్డిని హరీశ్‌రావు హెచ్చరించారు. సిద్దిపేట ప్రజలు కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ గల్లంతు చేస్తారని అన్నారు. సిద్దిపేటపై రేవంత్ రెడ్డికి ఎందుకంత పగ? అని ప్రశ్నించారు. సిద్దిపేటపై బీజేపీకి ఎందుకింత ద్వేషం? రఘునందన్ దుబ్బాక నుంచి గెలిచినా ఎందుకు ఢిల్లీ నుంచి నిధులు తీసుకురాలేదు? ఇతనికి ఓటేయడం మన వేలితో మన కంటినే పొడుచుకోవడం అని అన్నారు. ఇతడు గెలిస్తే మనకు న్యాయం చేస్తాడా? రఘునందన్ బాగా పనిచేస్తే అసెంబ్లీ ఎన్నికల్లో 54 వేల ఓట్ల తేడాతో దుబ్బాక ప్రజలు ఎందుకు ఓడించారు? అని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు.
దేశంలో బీజేపీ నాయకుల మీద ఒక్క కేస్ ఉందా అని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీల గొంతులు నొక్కడానికే బీజేపీ కేసులు పెడుతున్నదని ఆయన ఆరోపించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఎమ్మెల్సీ కవిత, కేరళ ముఖ్యమంత్రి కూతురు మీద కేసులు పెట్టారని తెలిపారు. బీజేపీ వాళ్లు దేవుడిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. శ్రీరాముడు అందరి దేవుడన్నారు. యాదగిరిగుట్ట లాంటి మహాక్షేత్రం నిర్మించిన చరిత్ర కేసీఆర్‌ది అని అన్నారు. కేసీఆర్ చేసినన్ని యాగాలు, యజ్ఞాలు ఎవరైనా చేశారా..? అని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ఫేక్ ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలు, పార్టీ క్యాడర్‌కు ఆయన సూచించారు. ఫేక్ ప్రచారాన్ని ఎక్కడికక్కడ తిప్పికొట్టాలన్నారు. కేసీఆర్ నాయకత్వంలో జరిగిన అభివృద్ధిని.. నేటి కాంగ్రెస్ పార్టీ మోసాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని క్యాడర్‌కు పిలుపునిచ్చారు.