హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్రెడ్డి రియల్ ఎస్టేట్ మనస్తత్వాన్ని విడిచిపెట్టి ప్రజల సంక్షేమాన్ని కోరుకునే విశాల దృక్పథం ఉన్న నాయకుడిగా మారాలని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ సూచించారు. ‘ఏపీతో సమానంగా పనిచేస్తాం’ అని రేవంత్రెడ్డి వ్యాఖ్యానించి తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారని ఆదివారం ఎక్స్ వేదికగా దుయ్యబట్టారు. తెలంగాణ ప్రతి అభివృద్ధి సూచీలో ముందున్నదని, ఆరోగ్యసూచీలో ఎంతో ముందున్నదనే విషయాన్ని సీఎం తెలుసుకోవాలన్నారు. అదే సమయంలో ప్రభుత్వ రంగంలో బలమైన గ్రామీణ ఆరోగ్య సంరక్షణ అవసరం ఉన్నదని చెప్పారు. కార్పొరేట్ హాస్పిటళ్ల లైసెన్స్ దోపిడీని నియంత్రించకుండా ముఖ్యమంత్రి ఆరోగ్య పర్యాటకం పేరుతో మరిన్ని కార్పొరేట్ హాస్పిటళ్లను ప్రోత్సహించేందుకు వేల ఎకరాల విలువైన భూములను కేటాయిస్తామని పేర్కొనటం వెనుక రియల్ ఎస్టేట్ వ్యాపార కోణం దాగి ఉందనే విషయాన్ని ప్రజలు గ్రహించాలని పేర్కొన్నారు.