మణుగూరు టౌన్, మార్చి 10 : గత కేసీఆర్ ప్రభుత్వం నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి సమర్థవంతంగా నిర్వహిస్తే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లలోనే వాటిని నిర్వీర్యం చేసేందుకు కుట్రలు పన్నుతోందని, నిర్వహణను గాలికొదిలేసిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఆరోపించారు. మణుగూరు పట్టణంలోని బీసీ బాలికల గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తినిగి 15 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన విషయం విదితమే. దీనిపై ఆయన స్పందిస్తూ మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వం తీరును ఎండగట్టారు.
ఇసుక అక్రమ రవాణాలో బిజీగా ఉన్న ఎమ్మెల్యే, ఎంపీలకు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన విద్యార్థినుల గురించి పట్టించుకునే తీరిక లేదని మండిపడ్డారు.రాష్ట్రవ్యాప్తంగా 90 గురుకులాల్లో రేవంత్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో కలుషిత ఆహారం తిని ఇప్పటి వరకు 127 మంది విద్యార్థులు మృతి చెందడం బాధాకరమన్నారు. ఇలాంటి ఘటనలు చూస్తున్న తల్లిదండ్రులు తమ పిల్లలను గురుకుల పాఠశాలలకు పంపించాలంటేనే జంకుతున్నారని పేర్కొన్నారు. వెనుకబడిన తరగతుల విద్యార్థులు చదువుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారనే ధోరణితో విద్యావ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు.
అస్వస్థతకు గురైన 15 మంది విద్యార్థినులను పరామర్శించేందుకు వెళ్లగా టీచర్ల కంటే డాక్టర్ల వ్యవహార శైలి సరిగ్గా లేదని, మీడియాకు, ప్రజాప్రతినిధులకు సరైన సమాధానం చెప్పే విషయంలో వారు వ్యవహరించిన తీరు సరిగా లేదన్నారు. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి జిల్లావ్యాప్తంగా అన్ని వసతి గృహాలు, గురుకులాలను సందర్శిస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమం, విద్యార్థుల భవిష్యత్‌పై బాధ్యత లేకుండా సాగిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వ పాలన అధ్వానంగా ఉందన్నారు.
విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడం, భద్రత కల్పించే అంశంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కుర్రి నాగేశ్వరరావు, పట్టణ అధ్యక్షుడు కుంట లక్ష్మణ్, మాజీ జడ్పీటీసీ పోషం నర్సింహారావు, నాయకులు యాదగిరి గౌడ్, నూకారపు రమేశ్, అడపా అప్పారావు, ముద్దంగుల కృష్ణ, జావీద్ పాషా, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.