KCR : తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్లీ అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. అదివారం తెలంగాణ భవన్లో జరిగిన తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొందరు బీఆర్ఎస్ను ఖతం చేస్తం అంటున్నరని, 25 ఏళ్ల ప్రస్థానమున్న బీఆర్ఎస్ను ఖతం చేయడం ఎవరివల్లా కాదని వ్యాఖ్యానించారు.
‘తెలంగాణ వస్తుందని ఎవరూ కల కనలేదు. పదిహేనేళ్ల పోరాటం తర్వాత తెలంగాణ వచ్చింది. బీఆర్ఎస్ను ఖతం చేస్తామని మాట్లాడుతున్నరు. ఇవన్నీ టెంపరరీ సెట్బ్యాక్స్. మళ్లీ మేం అధికారంలోకి వస్తం. అందులో 100శాతం అనుమానం లేదు. 25 ఏళ్ల ప్రస్థానమున్న పార్టీని ఖతం చేయగలరా..? పదేళ్లు విపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఖతమైందా..? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మనదే అధికారం’ అని కేసీఆర్ ధీమా వ్యక్తంచేశారు.
అంతకుముందు కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం అమరవీరులకు నివాళులర్పించారు. ఆ తర్వాత మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాడు కాంగ్రెస్ హయాంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే కనీసం నీళ్ల కోసం మాట్లాడినవాళ్లు కూడా లేరన్నారు. పాలమూరులో సభపెట్టి పోరాటం చేస్తే జూరాలకు నీళ్లు వచ్చాయని చెప్పారు. అప్పట్లో కుడి కాలువకు ఫ్రీగా నీళ్లిచ్చి, ఎడమ కాలువకు ఛార్జీలు వసూలు చేసేవాళ్లని తెలిపారు.