ఆదిలాబాద్ : కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై బీఆర్ఎస్ పోరుబాట ( BRS Protest ) నిర్వహించింది. ఇచ్చోడ విద్యుత్ సబ్స్టేషన్ ( Sub Station ) ముట్టడించి వంటా వార్పుతో నిరసన తెలిపారు. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ( MLA Anil Jadhav ) రైతులతో కలిసి ఉరి తాడుతో వినూత్న నిరసన తెలిపారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ముఖ్యంగా వ్యవసాయానికి అవసరమైన విద్యుత్ సరఫరాలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం , ఇప్పుడు రైతులను కరెంట్ కోతలతో ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు.
విద్యుత్ సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం ప్రజల సమస్యలను పట్టించుకోకుండా వ్యవహరిస్తోందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా, రైతుబంధు, రైతుబీమా వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశామని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని ఆరోపించారు.