– తల్లిదండ్రుల జ్ఞాపకార్థం నిర్మించిన పొన్నెకంటి కుటుంబ సభ్యులు అభినందనీయులు
– ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
జూలూరుపాడు, మే 13 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని గుండెపుడి గ్రామంలో ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ నూతనంగా నిర్మించిన వంతెనను కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు బుధవారం ప్రారంభించారు. సుమారు రూ.7 లక్షల వ్యయంతో గ్రామంలోని ప్రజల అవసరాల కోసం ఈ వంతెన నిర్మాణాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ.. తమ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం గ్రామస్తుల సౌకర్యం కోసం వంతెన నిర్మించాలని పొన్నెకంటి కుటుంబ సభ్యులు తీసుకున్న నిర్ణయం ఎంతో అభినందనీయమని కొనియాడారు. సమాజం పట్ల బాధ్యతతో, సేవా దృక్పథంతో సొంత నిధులను వెచ్చించి గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు కావడం గొప్ప విషయమని ఆయన ప్రశంసించారు.
ఇటువంటి సేవా కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో మరిన్ని జరగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా, మండల కార్యదర్శి గుండెపిన్ని వెంకటేశ్వర్లు, నాయకులు కాళ్లూరు వెంకటేశ్వరరావు, కొమ్మిని పాండురంగారావు, దుద్దుకూరి సుమంత్, కొమ్మిని నాగేశ్వరరావుతో పాటు పలువురు గ్రామ పెద్దలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

గుండెపుడిలో వంతెన ప్రారంభం