I Bomma | టాలీవుడ్లో పైరసీ సమస్య మరోసారి తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది. చాలా కాలంగా మూతపడినట్లు భావించిన ‘ఐబొమ్మ’ వెబ్సైట్ మళ్లీ ఆన్లైన్లో కనిపించడం సినీ పరిశ్రమలో కలకలం రేపుతోంది. థియేటర్లలో విడుదలైన కొత్త సినిమాలు కొన్ని గంటల్లోనే హై క్వాలిటీ ప్రింట్లతో ఈ వెబ్సైట్లో అందుబాటులోకి వస్తుండటంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈ వెబ్సైట్ నిర్వహణలో కీలక పాత్ర పోషించాడన్న ఆరోపణలతో ఇమంది రవిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ‘ఐబొమ్మ’ కార్యకలాపాలు పూర్తిగా ఆగిపోయాయని భావించారు. అయితే ఇటీవల ఆయన బెయిల్‌పై బయటకు వచ్చిన కొద్ది రోజులకే వెబ్సైట్ మళ్లీ యాక్టివ్ కావడం అనుమానాలకు తావిస్తోంది.
ఈ సైట్‌ను మళ్లీ ఎవరు ప్రారంభించారు? దీనిలో ఇమంది రవి పాత్ర ఏమైనా ఉందా? లేక మరో కొత్త గుంపు దీన్ని నిర్వహిస్తోందా? అనే అంశాలపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీసులు ఈ వెబ్సైట్ వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించే పనిలో ఉన్నారు. సాంకేతికంగా డొమైన్లు మారుస్తూ, సర్వర్లు మార్చుకుంటూ ఈ తరహా పైరసీ వెబ్సైట్లు తప్పించుకుంటుండటంతో వాటిని పూర్తిగా అరికట్టడం అధికారులకు సవాల్‌గా మారింది. సినిమా విడుదలైన కొద్ది గంటల్లోనే పైరసీ ప్రింట్లు బయటకు రావడం వల్ల నిర్మాతలకు భారీ ఆర్థిక నష్టం జరుగుతోందని సినీ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
ఇక మరోవైపు థియేటర్ రంగం కూడా ఇప్పటికే తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఓటీటీ వేదికల ప్రభావం, ప్రేక్షకుల వీక్షణ అలవాట్ల మార్పు కారణంగా థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గుతోంది. ఈ పరిస్థితుల్లో పైరసీ మరింత దెబ్బతీస్తోందని ఎగ్జిబిటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కొంతమంది థియేటర్ యజమానులు రెంటల్ విధానానికి బదులుగా పర్సంటేజీ షేరింగ్ విధానం తీసుకురావాలని కోరుతున్నారు. సినిమా హిట్ అయితే లాభాలు, ఫ్లాప్ అయితే నష్టాలు నిర్మాతలు, ఎగ్జిబిటర్లు కలిసి పంచుకోవాలన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పైరసీ, థియేటర్ల ఆర్థిక సమస్యలు రెండూ కలిసి తెలుగు సినిమా పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సమస్యలను అరికట్టేందుకు కఠిన చట్టాలు, సాంకేతిక చర్యలు, వేగవంతమైన అమలు అవసరమని ఇండస్ట్రీ వర్గాలు కోరుతున్నాయి.